KCR,KTR Tours: తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానం ఖచ్చితంగా కేటీఆర్‌దే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం. ప్రగతిభవన్, ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ రోజులకు రోజులు బయటకు రాకున్నా అన్నీ తానై ప్రభుత్వ కార్యక్రమాలను నడిపిస్తుంటారు కేటీఆర్. విపక్షాల ఆరోపణలకు తన పవర్ ఫుల్ పంచ్‌లతో బదులిస్తుంటారు. కేసీఆర్ అందుబాటులో లేని లోటు కనిపించనీయకుండా మేనేజ్ చేస్తుంటారు. కేసీఆర్ ఎక్కడ ఉన్న ఆయన ఆదేశాల ప్రకారం అన్ని పనులూ చక్కబెట్టడం కేటీఆర్‌కు అలవాటైపోయింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కేటీఆర్ అందరికీ తలలో నాలుకలా మారిపోయారు. పెద్దాయనకు చెప్పుకోలేని ఇష్యూలను కూడా కేటీఆర్ తో సాల్వ్ చేయించుకోవడం అదరికీ కామనైపోయింది.
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా, ఇతర రాష్ట్రాలకు వెళ్లినా కేటీఆర్ ఇక్కడే ఉండి పాలనలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునేవారు. కేసీఆర్,కేటీఆర్ ఇద్దరూ రాష్ట్రంలో అందుబాటులో లేకుండా ఉండటం చాలా అరుదనే చెప్పాలి. ఒకటి రెండు రోజులు అలా ఉన్నా వారాలకు వారాలు ఇద్దరూ రాష్ట్రంలో ఉండకుండా పోవడం ఈ మధ్య అస్సలు జరుగలేదు. కానీ తాజాగా ప్రభుత్వంలో టాప్ 2 పొజిషన్లలో ఉన్న ఇద్దరు నేతలు దాదాపు వారం పాటు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా పోయారు. ఈ నెల 17 నే యూకే పర్యటనకు వెళ్లిన కేటీఆర్ అట్నుంచి అటే దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్నారు. 27 న రాష్ట్రానికి తిరిగొస్తారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా.. జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశపర్యటనకు వెళ్లారు. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్ర పర్యటనలకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ నెల 27 లేదా 28 న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అంటే వచ్చే వారంపాటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉండటంలేదు.
ఓ వైపు ఖరీఫ్ సీజన్ తరుముకొస్తోంది. మరో పక్షం రోజుల్లోనే వ్యవసాయ పనులు మొదలయ్యే అవకాశముంది. ఇటు వరి ధాన్యం కొనుగోలు ఇప్పటికీ సవ్యంగా కొనసాగడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. దీనిపై రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై విపక్షాలు యుద్ధభేరీ మోగించాయి. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ యాత్రలు, సభలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా అధికారపార్టీ నేతలపైనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. పార్టీ జడ్పీ చైర్‌పర్సన్ తో పాటు మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం టీఆర్ఎస్ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఇద్దరికీ తలలో నాలుకలా ఉండే ఎంపీ సంతోష్ కుమార్ కూడా .. సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత మాత్రం తెలంగాణలో అందుబాటులో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఏదైనా అత్యవసర నిర్ణయాలు వారి కనుసన్నల్లో జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ ఎక్కడున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించడం ఆయనకు అలవాటే అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది పెద్ద సమస్యే కాదని కొట్టిపారేస్తున్నారు.
also read: Pawan Kalyan Tour: తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..నేతలకు పవన్ కళ్యాణ్ పిలుపు..!
also read: Nallala Odelu:ఈటల మిత్రుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? బీజేపీలో ఏం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.