అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పోటాపోటీ మాటలయుద్ధం జోరందుకున్నాయి. తాజాగా ఇరు ఇరుపార్టీల మధ్య ట్విటర్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బఫూన్ అంటూ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీనేత దిగ్విజయ్ సింగ్ ఖండిస్తూ చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలను ఖండించడం కన్నా ముందు తెలంగాణకు స్పెల్లింగ్ రాయడం తెలుసుకోవాలని చురకలంటించారు. ఈమేరకు కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్‌లో తెలంగాణను ఆంగ్లంలో 'telengana' అని రాయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
అంతకు ముందు కేసీఆర్ రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందించారు. ఎన్నో అవరోధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అలాంటి పార్టీ అధ్యక్షుడిపై ఉపయోగించిన భాషకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కృతజ్ఞత లేని కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు బుద్దిచెప్తారన్నారు. అందుకు కౌంటర్‌గా ‘‘మొదట తెలంగాణ అని సరిగ్గా రాయడం నేర్చుకోండి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అంతకు ముందు కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.‘‘రాజకీయాల్లో ఏం చేయాలో అంట్లు కడిగిన కేటీఆర్ మాకు చెప్పనవసరం లేదు’’ అన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ..‘‘అమెరికాలో నివసించే ప్రతి భారతీయుడు తాము భోజనం చేసిన పళ్లెంను స్వయంగా శుభ్రం చేసుకుంటాడు. అలాగే నేనూ చేశాను. మీ పప్పు(రాహుల్)లా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.