వర్శిటీలలో విస్తరిస్తున్న రాడికల్ విభాగాలు..?

యునివర్సిటీల్లోని విద్యార్థులను మావోలు చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Last Updated : Apr 1, 2018, 04:52 PM IST
వర్శిటీలలో విస్తరిస్తున్న రాడికల్ విభాగాలు..?

తెలంగాణ: యునివర్సిటీల్లోని విద్యార్థులను మావోయిస్టులు తమ గ్రూపుల్లోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు) గుర్తించాయని సమాచారం. మావోయిస్టు పార్టీ కేడర్‌ను పెంచుకోవడం, సాంకేతికంగా బలపడటం కోసం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని వ్యూహాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను చేర్చుకోవడంపై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టిందన్న విషయం ఆందోళన కలిగించేలా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న సంఘాలైన రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్, రాడికల్‌ యూత్‌ లీగ్, ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్‌ ఫెడరేషన్, విప్లవ కార్మిక సంఘం, రెవల్యూషనరీ రైటర్స్‌ అసోసియేషన్‌ వంటివి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించాయని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం నిషేధిత జాబితాలో వీటిని చేర్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ సంఘాలపై నిషేధం కొనసాగుతోంది.

అయితే తెలంగాణ ఏర్పడ్డ మరుసటి సంవత్సరం 2015 లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సుమారు 24 మంది విద్యార్థులు అదృశ్యం కాగా.. వీరు మావోయిస్టు పార్టీలో చేరారని సమాచారం. కాగా ఈ వర్సిటీల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీపై దృష్టి పెట్టారని తాజాగా పృథ్వీరాజ్(కృష్ణా జిల్లా), చందన్ మిశ్రాల (పశ్చిమ బెంగాల్) అరెస్టు స్పష్టం చేస్తోందని... రోహిత్ ఆత్మహత్యకు ప్రతిగా వీసీ అప్పారావు హత్యకు మిశ్రా ప్లాన్ చేశారని పోలీసుల ఆరోపణ.

వీసీ హత్యకు కుట్రపన్నారంటూ పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలపై పోలీసులు ఆరోపణలు చేసినా.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలేవీ వెల్లడించకపోవడంతో.. విప్లవ రచయితల సంఘం (విరసం) పోలీసుల ఆరోపణలను ఖండిస్తోంది. పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలను నాలుగు రోజుల క్రితం విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని... వీసీ హత్య కుట్ర పేరిట విశ్వవిద్యాలయాల్లో మరింత నిర్బంధ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంది.

మావోయిస్టులు హెచ్‌సీయూ వైస్‌ చాన్సలర్‌ అప్పారావు హత్యకు కుట్రపన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. రోహిత్‌ వేముల ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఇద్దరు గన్‌మన్లను కేటాయించింది. అయితే తాజా సమాచారంతో హెచ్‌సీయూలో వీసీ కార్యాలయం, అధికారిక నివాసాల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని పెంచి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

Trending News