Srinivas Goud Fires On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ జిల్లాకు చెందిన వాడు కావడం సిగ్గు చేటు అని మంత్రి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కోలేక కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన మంత్రి.. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశరు. రేవంత్ రెడ్డి ప్రవృత్తి చీటింగ్ బ్లాక్ మెయిలింగ్ అని.. ఆర్‌టీఐని అడ్డం పెట్టుకుని కోట్లు గడించాడని ఆరోపించారు. వక్ఫ్ భూముల గురించి అబద్దాలు మాట్లాడుతున్నాడని అన్నారు.
"నేను ఒక ఇంచు వక్ఫ్ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా..? కోర్టు కేసులతో నోట్లు సంపాదిస్తావేమో గానీ ఓట్లు సంపాదించుకోలేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్ నగర్‌లో ఎవ్వరూ సాధించని మెజార్టీతో నేను గెలిచాను.. అందుకే అక్కసా..? రేవంత్‌ను మా జిల్లాలో ఓడించినా బుద్ది రాలేదు. ప్రజల్లో మాకున్న మద్దతును చిల్లర మల్లర కేసులు చెరపి వేయలేవు.
నా మీద బురద జల్లడానికి అన్ని పార్టీల్లోని కొందరు నేతలు ఒక్కటయ్యారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నన్ను బద్నామ్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు. బడుగు బలహీన వర్గాలు అంటే ఇంత చులకనా..? రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ బలోపేతం అయ్యే ప్రసక్తే లేదు. మహారాష్ట్రలో కేసీఆర్‌కు విశేష ఆదరణ వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ అద్భుతంగా ఫలితాలు సాధించబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం గడితే అప్పుడే పదవుల కోసం కొట్లాడుతున్నారు. పథకాలు అనేక షరతులతో అమలు చేస్తున్నారు. కరెంట్ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా సరిగా అక్కడ అమలు చేయడం లేదు
నాది క్యాస్ట్ తక్కువ కావచ్చు. క్యారెక్టర్ తక్కువ కాదు. చిల్లర గ్యాంగ్‌ను వేసుకుని రేవంత్ నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ చిట్టా విప్పుతా.. రేవంత్ ఒక ఓటుకు నోటుకు దొంగ. రేవంత్ ఎక్కడా పోటీ చేసినా ఆ చీడ పురుగుకు ఓటు వేయొద్దని ప్రజలకు చెబుతా. నా ఎన్నికల అఫిడవిట్‌పై దుష్ప్రచాచారం జరుగుతోంది.." అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరులో కాంగ్రెస్ గెలవడం కలేనని అన్నారు.