MLC Kavitha Vs MP Arvind:తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య వార్ సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే.. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. నిజామాబాద్ జిల్లాలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత పోటాపోటీ కార్యక్రమాలతో రచ్చ చేస్తున్నారు. దీంతో జిల్లాలో రోజు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు కవిత. దాదాపు మూడేళ్ల పాటు అమె తెరవెనుకే ఉండిపోయారు. ఎంపీగా ఓడిపోయాకా దాదాపు రెండేళ్ల పాటు నిజామాబాద్ జిల్లాలో తిరగలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించలేదు కవిత. అయితే కొన్ని రోజులుగా ఆమె మళ్లీ దూకుడు పెంచారు. లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన పసుపు బోర్డు అంశం కేంద్రంగానే రాజకీయ పావులు కదుపుతున్నారు కవిత. పసుపు బోర్డు హామీతో ఎన్నికల్లో గెలిచిన అర్వింద్ ను.. అదే అంశంలో ఇరికించే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ అర్వింద్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో అర్వింద్ ను తూర్పారబట్టారు కవిత. పసుపు బోర్డు కోసం అర్వింద్ ఢిల్లీలో అసలు ప్రయత్నాలే చేయలేదని ఆరోపించారు. పసుపు రైతులను అర్వింద్ దగా చేశారని కవిత మండిపడ్డారు.
ఎంపీ అర్వింద్ పై కవిత ఆరోపణలు చేశాక జిల్లాలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అర్వింద్ కు వ్యతిరేకంగా జిల్లాలో ఎక్కడికక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో అర్వింద్ ఎక్కడ పర్యటించినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూరులోని అర్వింద్ నివాసం ముందు పసుపు బోర్డు రైతులు నిరసనకు దిగడం సంచలనంగా మారింది. ఎంపీ ఇంటి ముందు పసుపును పోసి నిరసన తెలిపారు రైతులు. పసుపు బోర్డును సాధించలేని అర్వింద్.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులు ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కడం జిల్లాలో కాక రేపింది.
అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఊహించని నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ నగరంలోని కవిత ఇంటి ముందు హమాల్ వాడి వాసుల ఆందోళన చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత ఇంటిముందు బస్తీవాసులు ఆందోళన చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో టీఆర్ఎస్ నేతలు, కవిత అనుచరులు షాకయ్యారు. కవిత ఇంటి దగ్గర జరిగిన ఆందోళన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర పసుపు రైతులతో అధికార పార్టీ నేతలో ఆందోళన చేయించారని భావిస్తున్న బీజేపీ నేతలు ఇలా .. కవిత ఇంటి ముందు స్థానికులతో కలిసి స్కెచ్ వేశారని అంటున్నారు.
ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర పసుపుతో నిరసన... ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం స్థానికుల ఆందోళనతో ఇందూరు రాజకీయాలు రచ్చగా మారాయి. వమూడేళ్ల పాటు సైలెంట్ గా ఉన్న కవిత యాక్టివ్ కావడంతో.. ఇకపై నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు రణరంగంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
READ ALSO: Revanth Reddy On Ktr: కల్వకుంట్ల ఫ్యామిలీది నీచమైన చరిత్ర- రేవంత్‌రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook