Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: బీఆర్‌ఎస్‌లో లాబియింగ్‌లు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వే ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఈ సారి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ 40 మంది లిస్టులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు ఉన్నట్టు తెలిసింది. దీంతో జనరల్ సీటైన జనగామపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కళ్లు పడ్డట్టు స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ బలాన్ని చూపుతూ సీఎం కేసీఆర్ వద్ద లాబియింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చేర్యాలలో చెరువు కట్ట కింద ఉన్న అంగడి స్థలాన్ని కబ్జా చేశారన్న వార్తలో పరువు పోగొట్టుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై సొంత కూతురే ఫోర్జరీ కేసు పెట్టి బహిరంగ ప్రకటనలు చేయడం ఆయన్ను మరింత బజారున పడేసినట్టయింది. కన్న కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిని నియోజకవర్గం ప్రజల ముందు నిలబెట్టి కడిగిపారేయడం ఎమ్మెల్యేకు పెద్ద దెబ్బ పడినట్టు అయ్యింది. బిడ్డ ప్రత్యేక్షదాడులను తట్టుకోలేక ఏకంగా ముత్తిరెడ్డి కోర్టులకు వెళ్లారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ‘ఈ సారి నిలిచేది నేనే.. గెలిచేది నేనే’ అంటూ పైకి గంబీరాలు పలుకుతున్న ముత్తిరెడ్డికి అసలు టికెట్ వస్తుందా అని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
ఇక జనరల్ సీటైన జనగామపై మరో గులాబీ లీడర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి పడరాని పాట్లు పడుతున్నట్టు తెలిసింది. జనగామలోనూ తనకు బలం ఉందని సీఎం కేసీఆర్‌కు చూపేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కొందరు జడ్పీటీసీలతో మాట్లాడించారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా జిల్లాలోని కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి లెటర్ ప్యాడ్‌లపై రాసి ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
ఇదిలావుంటే, జనగాం నియోజకవర్గంలో చాలా మంది పల్లా కోరికపై విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నపై ‘చావుతప్పి కన్నులొట్ట పడిన’ చందంగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామలో అంత పట్టులేదని వారు భావిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు జనగామ నియోజవర్గంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలను కలిసి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై వ్యతిరేకత ఉందని నిరూపించాలని తరచు కలుస్తూ వస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు.. దానికి సంబంధించిన ఆడియోలు వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ స్థానికుడు కాకపోవడం ఈ క్రమంలోనే ఆయన కోరికను సున్నితంగా తిరస్కరించారని సమాచారం.
మరోవైపు జనగామ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా చాపకింద నీరులా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్ల మద్దతు కూడ గట్టుకున్న పోచంపల్లి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉన్న బీఆర్‌ఎస్ లీడర్లంతా పోచంపల్లికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌రెడ్డి జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకుంటూ పోచంపల్లి ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జనగామ నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకునేలా చేసారు. దీనితో ఎమ్మెల్యే అనుచరులు దానికి పోటీగా అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ ప్రకటించనున్న మొదటి లిస్ట్‌లో జనగామ పేరు లేకపోవడంతో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.
ఇది కూడా చదవండి : Muthireddy Yadagiri Reddy: గూండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్నే.. ముత్తిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జనగామ నియోజకవర్గ రాజకీయాలు చివరకు ప్రగతి భవన్ కు చేరాయి. ముత్తిరెడ్డి వ్యతిరేకులు పల్లా అనుచరులు రాజధాని హరిత హోటల్ లో కలుసుకున్నారని సమాచారం తో ముత్తిరెడ్డి హోటల్ లో ప్రత్యక్షం కావడంతో అక్కడున్న వాళ్లంతా కంగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వచ్చామని ఎమ్మెల్యేకు చెప్పకొచ్చారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలను సీఎం కేసీఆర్ కు వివరించేందుకు ముత్తిరెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థానిక ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి కానీ లేదా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే పల్లాను, పోచంపల్లిని కాదని ఇంకా ఎవరైనా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇది కూడా చదవండి : Palla Rajeshwar Reddy Audio Leak: పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుల ఆడియో లీక్ కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jongaon BRS MLA Ticket: జనగాంలో ముగ్గురు రెడ్ల మధ్య ముదురుతున్న MLA టికెట్ పంచాయితీ