Bhatti Vikramarka House Theft: సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇంటికే రక్షణ లేకపోవడం చూస్తుంటే తెలంగాణలో ఏ స్థాయిలో శాంతిభద్రతలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనానికి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకుని తెలంగాణకు తీసుకొచ్చారు. అయితే ఇంటి మనుషులే దొంగతనానికి పాల్పడడం కలకలం రేపింది. నమ్మకంగా పని చేస్తున్న పని మనుషులే చోరీకి పాల్పడడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో భారీ దొంగతనం..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్-14 బీఎన్ రెడ్డి కాలనీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసం ఉంది. ఆయన కొన్ని రోజుల కింద విదేశీ పర్యటన చేపట్టారు. ఈ సమయంలో ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. నగదు, ఆభరణాల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్ కొంతకాలంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో పని చేస్తున్నాడు.
Also Read: BRS Party: కేసీఆర్, కేటీఆర్‌కు భారీ షాక్.. సీఎం చంద్రబాబుతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీ
బెడ్‌రూమ్‌లోని రోషన్ మండల్ అల్మరా తాళాలు పగులగొట్టి రూ.2.50 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసి తన స్నేహితులు ఉదయ్కుమార్ మండల్, కృష్ణ, సంజులతో కలిసి ఉడాయించాడు. గత నెల 24న చోరీ చేసిన నగదు, వస్తువులతో ఉదయ్ కుమార్, సంజు, కృష్ణతో కలిసి నాంపల్లి దాకా ఆటోలో వెళ్లి అక్కడి నుంచి రైలులో ఘట్‌కేసర్ వెళ్లారు. ఘట్‌కేసర్ రైలెక్కి కాజీపేటలో దిగి అక్కడ మళ్లీ విజయవాడ రైలెక్కారు. విజయవాడ నుంచి విశాఖలో రైలు దిగి అక్కడి నుంచి బిహార్ ఖరగ్‌పూర్ రైలు ఎక్కారు.
గత నెల 26వ తేదీ ఉదయం ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో దిగిన వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో అక్కడి రైల్వే పోలీసులు గుర్తించారు. కృష్ణ, సంజు అక్కడి నుంచి పారిపోగా.. ప్రధాన నిందితుడు రోషన్ కుమార్, ఉదయ్ పట్టుబడ్డారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రాంబాబు బృందం ఖరగ్‌పూర్ వెళ్లి పీటీ వారెంట్ వేసి నిందితులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి శనివారం నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. నిందితులిద్దరికీ 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి