ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందేనని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం జేఎఫ్‌సీ తుది నివేదికలోని అంశాలను మీడియాకు వివరించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హోదానా లేక ప్యాకేజీనా అనే అంశంపై సీఎం చంద్రబాబు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ జనాలని అయోమయానికి గురయ్యేలా చేస్తున్నారని పవన్ అసహనం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రస్తావించిన పలు అంశాలు ఇలా వున్నాయి.
> ఏపీకి కేంద్రమే 90శాతం నిధులు కేటాయించాలి.
> రాష్ట్ర అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పాచిపోయిన లడ్డూలైనా తీసుకుంటామని గతంలో టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటివరకు కనీసం ఆ పాచిపోయిన లడ్డూలు కూడా పూర్తిగా అందలేదు.
> రాష్ట్ర విభజనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థిరాస్తుల పంపకాల విషయంలోనూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో ఏపీ ప్రజలు అక్కడ అవస్థలు పడుతున్నారు.
> ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది.
> పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కనుక ఆ ప్రాజెక్టుని నిర్ణీత సమయంలోనే పూర్తి చేసే బాధ్యత కూడా కేంద్రానిదే. అయితే, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లకపోతే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది.
> కేంద్రం విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటించాలి. బీహార్‌లో హాజీపూర్‌కు రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యమైనప్పుడు ఏపీకి విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు ? కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కోరారు కనుక బీహార్‌కి రైల్వే జోన్ ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీని మాత్రం కేంద్రం నిలబెట్టుకోవడం లేదు.
> దుగరాజుపట్నం పోర్టును కేంద్రం నిర్మిస్తామని చెప్పినప్పడు ఏపీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయింది ? ఏపీ ప్రభుత్వం అందుకు మరో ప్రత్యామ్నాయాన్ని ఎందుకు చూపలేకపోయిందనేది ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.
> 11 జాతీయ విద్యాసంస్థలకు గాను 9 విద్యాసంస్థలే ఇచ్చారు. 9 విద్యాసంస్థలకు 5శాతం నిధులే కేటాయించారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం కావడంలేదు.
> కేంద్రం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందనే భయం వేస్తోంది. అయినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడమంటే పుండుమీద కారం చల్లినట్టుగానే భావించాల్సి వుంటుంది అని పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.