తెలంగాణలో ప్రైవేటు టీచర్లపై అదనపు భారం.. శ్రుతిమించుతున్న యాజమాన్యాల ఆగడాలు..!

స్కూలు టీచర్లనే సేల్స్ స్టాఫ్‌గా మార్చేశాయి తెలంగాణలో పలు పాఠశాలలు. టీచర్లకే స్కూలు అడ్మిషన్ బ్రోచర్లు, ఫారమ్స్ ఇచ్చి ఇంటింటికీ వెళ్లి మార్కెటింగ్ చేయమంటున్నాయి. అలాగే ఇంతమంది విద్యార్థులను జాయిన్ చేయించాల్సిందేనని టార్గెట్ కూడా పెడుతున్నాయి

Edited by - Babu Koilada | Last Updated : Mar 30, 2018, 12:48 PM IST
తెలంగాణలో ప్రైవేటు టీచర్లపై అదనపు భారం.. శ్రుతిమించుతున్న యాజమాన్యాల ఆగడాలు..!

ఏప్రిల్ రెండవ వారం నుండి స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. కొన్ని స్కూళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పాఠశాలలన్నీ అడ్మిషన్ల హడావుడిలో పడిపోయాయి. అయితే అడ్మిషన్లు రావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి కదా. అందుకే తమ స్కూలు టీచర్లనే సేల్స్ స్టాఫ్‌గా మార్చేశాయి తెలంగాణలో పలు పాఠశాలలు. టీచర్లకే స్కూలు అడ్మిషన్ బ్రోచర్లు, ఫారమ్స్ ఇచ్చి ఇంటింటికీ వెళ్లి మార్కెటింగ్ చేయమంటున్నాయి. అలాగే ఇంతమంది విద్యార్థులను జాయిన్ చేయించాల్సిందేనని టార్గెట్ కూడా పెడుతున్నాయి.

కాన్వాసింగ్ పేరుతో ప్రారంభమైన ఈ సంప్రదాయం వల్ల అష్టకష్టాలు పడుతున్నామని చెబుతున్నారు పలువురు టీచర్లు. పలు స్కూళ్లు అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేయని ఉపాధ్యాయులకు జీతం కోత కూడా విధిస్తామని చెప్పడంతో వారు తప్పక ఈ పనులు చేయడానికి ఒప్పుకుంటున్నారు. తమ దయనీయ స్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. 

అయితే ఈ అంశంపై పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్న విషయాలు వేరేగా ఉన్నాయి. ఉపాధ్యాయులను ఉద్యోగంలోకి తీసుకొనే ముందే మార్కెటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని చెబుతున్నామని.. వారికి ఇష్టమైతేనే ఉద్యోగంలోకి తీసుకుంటున్నామని వారు అంటున్నారు. పైగా ఉపాధ్యాయులు తీసుకొచ్చే ప్రతీ విద్యార్థిపై ఇన్సెన్టివ్ పేరుతో అదనపు మొత్తం కూడా టీచర్లకు చెల్లిస్తున్నామని వారు తెలియజేస్తున్నారు.

అయితే టీచర్లను కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా.. మార్కెటింగ్ ఏజెంట్లుగా కూడా ఉపయోగించుకోవడాన్ని పలు ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు అందించినా ఫలితం లేదని.. ప్రైవేటు టీచర్లపై యాజమాన్యాల ఆగడాలు పెరిగిపోతున్నాయని పలు ఉపాధ్యాయ సంఘాలు  ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో జీన్యూస్ ఆన్‌లైన్ విభాగం, తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫారమ్ ప్రతినిధి షేక్ షబ్బీర్ అలీను సంప్రదించి వివరణ కోరగా.. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. పీజీలు,  బీఈడీలు పూర్తిచేసి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని భావిస్తున్న టీచర్లను ప్రైవేటు స్కూళ్లు మార్కెట్ ఏజెంట్లగా  ఉపయోగించుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో అనేక ప్రైవేటు స్కూళ్లు ఉపాధ్యాయులకు లెక్కలేనన్ని షరతులు పెడుతున్నాయని.. జాబ్‌లో చేరే ముందే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను యాజమాన్యానికి అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఇప్పటికీ పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కూడా ఉపాధ్యాయులకు కల్పించని స్కూళ్లు చాలా ఉన్నాయని.. వాటికి ప్రభుత్వం ఎలా లైసెన్సులు మంజూరు చేసిందని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలలో ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. బోధనతో పాటు మార్కెటింగ్ కార్యకలాపాలకు కూడా యాజమాన్యాలు తమను వాడుకుంటున్నాయని.. అడ్మిషన్ల టార్గెట్ పూర్తిచేయని ఉపాధ్యాయులకు జీతంలో కోత కూడా విధిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సెలవు దినాల్లో కూడా పని చేయాలని ప్రైవేటు పాఠశాలలు డిమాండ్ చేస్తున్నాయని.. లేకపోతే ఉద్యోగంలో నుండి నిర్దాక్ష్యిణ్యంగా తొలిగిస్తున్నాయని చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు టీచర్ల దుస్థితిని గమనించి తగిన న్యాయం చేయాలని.. ఉపాధ్యాయులతో ఊడిగం చేయిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తగు క్రమశిక్షణ చర్య తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫారమ్ తరఫున ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో దాదాపు 2.5 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారని.. ఇటీవలే కొందరు యాజమాన్యం ఒత్తిడికి తట్టుకోలేక శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. 

Trending News