Nagaraju Wife Ashreen Reaction Video: నాగరాజు.. సయ్యద్ అశ్రీన్ సుల్తానా.. ఇద్దరూ వికారాబాద్ జిల్లా వాస్తవ్యులు. స్టేషన్ మరపల్లికి చెందిన నాగరాజుకు అశ్రీన్ ఇంటర్ చదువుతుండగా పరిచయమైంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వదిలి ఉండలేని స్థితికి వచ్చారు. విషయం వారింట్లో తెలిసింది. మతాలు వేరుకావడంతో ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా అశ్రీన్ ఇంట్లో నాగరాజు పేరెత్తితే పెద్ద యుద్ధమే. నాగరాజు కోసం ఎన్నో సార్లు దెబ్బలు తిన్నది అశ్రీన్. ఆమె అన్నతో పాటు బంధువులు కూడా ఈ విషయంలో అశ్రీన్‌ను శారీరకంగా హింసకు గురిచేశారు. అయినా ఆమె నాగరాజును మరచిపోలేదు. పెళ్లంటే చేసుకుంటే నాగరాజునే చేసుకుంటానని భీష్మించుకుంది. దీంతో ఆమెను భయపెట్టడానికి మరో ఆయుధం బయటకు తీశారు ఆమె అన్న సయ్యద్ మొబీన్. నాగరాజును మర్చిపోకుంటే అతన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడ్డ అశ్రీన్.. వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోమని నాగరాజును బతిమాలింది. కానీ దానికి నాగరాజు ఒప్పుకోలేదు. బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం... లేదంటే కలిసి చనిపోదాం.. అని క్లియర్‌కట్ గా తేల్చేశాడు. అతని ప్రేమను, ధైర్యాన్ని కాదనలేని అశ్రీన్ జనవరి 30 వ తేదీన ఇళ్లు విడిచి వచ్చేసింది. ఆ రోజు కూడా కుటుంబసభ్యుల చేతిలో చావుదెబ్బలు తిన్నది. రక్తాలు కారుతుండగానే కాలుబయటపెట్టింది.ఇక తన మిగిలిన జీవితమంతా నాగరాజుతోనే అని డిసైడైంది.
జనవరి 31. ఆర్యసమాజ్‌లో నాగరాజు, అశ్రీన్‌ల పెళ్లి జరిగింది. నాగరాజు, అశ్రీన్‌ల క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు మరికొందరు పెళ్లికి సాయం చేశారు. ఓ ముస్లిం యువకుడు కూడా వీరి పెళ్లికి హెల్ప్ చేశాడు. ఆర్యసమాజ్ నిబంధనల మేరకు అశ్రీన్ పెళ్లికి ముందు మతం మార్చుకుంది. పల్లవి అని పేరు పెట్టుకుంది. అయితే పెళ్లి కోసమే ఈ పేరు మార్పు. ఆ తర్వాత ఎప్పుడూ నాగరాజు అశ్రీన్ ను పల్లవి అనే పేరుతో పిలవలేదు. తనకు ఇష్టమైన అశ్రీన్ అనే పిలిచేవాడు. హిందువుగా ఉండాలని కూడా ఎప్పుడూ నాగరాజు బలవంతంచేయలేదు.
పెళ్లైన వెంటనే అశ్రీన్‌ను మళ్లీ భయం వెంటాడింది. గతంలో వాళ్ల అన్నయ్య వార్నింగ్ గుర్తొచ్చింది. దీంతో ఆర్య సమాజ్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు దంపతులు. ఇద్దరం మేజర్లమని ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. పోలీసులు ఇద్దరి వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టేషన్ లో అశ్రీన్ అన్నతో పాటు మిగితా కుటుంబసభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. ఇంటికి వెళ్దాం పదా అంటూ అశ్రీన్ ను బతిమాలారు. కానీ వారి గురించి తెలిసిన అశ్రీన్ ఇంటికి వెళ్లడానికి తిరస్కరించింది. దీంతో వారు కామ్ గా వెళ్లిపోయారు. కానీ సొంత అన్నే తన కలల సౌధాన్ని కూల్చేస్తాడని అశ్రీన్ అప్పటికి ఊహించలేదు.
అశ్రీన్ వాళ్ల నాన్న నాలుగేళ్ల కిందటే చనిపోయాడు. ఆమెకు తల్లంటే ప్రాణం. తల్లికి కూడా కూతురంటే చెప్పలేని ఇష్టం. దీంతో పెళ్లైన పదిహేను రోజుల నుంచి అశ్రీన్‌తో మాట్లాడటానికి ఆమె తల్లి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ నాగరాజు ఫోన్ నంబర్ ఆమె వద్ద లేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసింది. అయితే భయంతో నాగరాజు నంబర్ ఇవ్వడానికి వారు నిరాకరించారు. కొత్తగా పెళ్లిచేసుకున్న నాగరాజు, అశ్రీన్ మాత్రం తమ నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంటూ కొత్త లైఫ్ లోకి ఎంటరయ్యారు. హైదరాబాద్ కు షిప్టయ్యి సరూర్‌నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో నాగరాజు పనిచేస్తూ...వచ్చినదాంట్లో అశ్రీన్‌ను హ్యాపీగా చూసుకునేవాడు. ఇలా మూడు నెలల పాటు వారి జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోయింది.
మే 4. ఎప్పట్లాగే నాగరాజు ఆఫీస్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. మధ్యలో బంధువుల ఇంట్లో ఉన్న అశ్రీన్ ను బైక్ పై ఎక్కించుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అయితే ఎన్నాళ్లనుంచో నాగరాజును చంపడానికి ప్లాన్ చేసిన అశ్రీన్ అన్న సయ్యద్ మొబీన్ .. మరో వ్యక్తితో కలిసి వారి బైక్‌ను అడ్డగించాడు. నాగరాజును కిందపడేసి రాడ్‌తో తలపై ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ ఘటనతో సడెన్ షాక్ కు గురైన అశ్రీన్ తన అన్నను ఆపడానికి ప్రయత్నించింది. కాపాడాలంటూ చుట్టూ ఉన్నవారిని కాళ్లావేళ్లా పడ్డది. అక్కడే వందలమంది ఉన్నా.. ఎవరూ స్పందించలేదు. మొబీన్‌ను ఆపడానికి ధైర్యం చేయలేదు. దీంతో వారిని అడిగి దండగ అనుకున్న అశ్రీన్ నేరుగా అన్నవద్దకే వెళ్లింది. నాగరాజు వదిలేయ్.. నీతో వస్తానని బతిమాలింది. అయినా ఆ కర్కష హృదయం కరగలేదు. మనసునిండా విద్వేషం నింపుకున్న మొబీన్ .. చెల్లిని తోసేసి మళ్లీ నాగరాజు తలపై కసితీరా బాదాడు. దీంతో అతను ప్రాణం వదిలేశాడు. కళ్లముందే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త రక్తపు మడుగులో పడి ఉండటంతో అశ్రీన్ గుండె పగిలిపోయింది. నాగరాజు శవంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించింది.
చుట్టూ వందలమంది జనం. అందులో ఒకరిద్దరు ధైర్యం చేసినా నాగరాజు బతికేవాడు. కనీసం గాయాలతోనైనా ప్రాణాలతో ఉండేవాడు. కానీ ఒక్కరు కూడా నాగరాజును కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడిదే విషయాన్ని ప్రశ్నిస్తూ సమాజాన్ని నిలదీస్తోంది అశ్రీన్. మనిషి ప్రాణం తీస్తుంటే ఒక్కరికి కూడా కాపాడాలనే మనసురాలేదా అని అడుగుతోంది. పక్కవారిని బతిమాలేబదులు తానే ఆ రాక్షసున్ని ఆపుంటే నాగరాజు ప్రాణాలు నిలిచేవేమోనని చెబుతోంది. వేరేవాళ్లపై ఆధారపడటమే తాను చేసిన నేరమంటోంది. ప్రాణాలు తీస్తుంటే స్పందించని జనం.. హత్య జరిగాక మాత్రం వందలమంది గుమిగూడారని ఆవేదన చెందింది అశ్రీన్.
తన జీవితాన్ని బుగ్గిపాలుచేసిన తన అన్న... అంతకు అంతా బాధ అనుభవించేలా చేస్తానంటోంది అశ్రీన్. నాగరాజు లేని లోకంలో తాను ఉండలేనని.. కానీ తన భర్తను చంపిన వాడి పతనం చూడటానికైనా తాను బతికిఉంటానంటోంది. నాగరాజుకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేని తాను.. కళ్లముందే ప్రాణంతీస్తుంటే ఏమీ చేయలేకపోయానని కన్నీరుపెట్టుకుంది. నాగరాజును పెళ్లిచేసుకోకుంటే ప్రేమ దొరకకున్నా.. కనీసం ప్రాణమైనా నిలిచేదికదా అని బాధపడుతోంది. అశ్రీన్ వేస్తున్న ఈ ప్రశ్నలకు బహుషా ఎవరివద్దా సమాధానం లేదేమో... మతం పేరుతో చెల్లి జీవితాన్ని ఛిద్రం చేసిన మొబీన్ మనసు ముందే మారినా... హత్యను (Hyderabad honor Killing) అడ్డుకునేందుకు ఒక్కరు ప్రయత్నించినా ఇప్పుడు అశ్రీన్ శోకం తీరేదేమో. అయినా పక్క ఇంటి వాడినే పట్టించుకోనంత యాంత్రికంగా మారిపోయిన నగర జీవితంలో రోడ్డుపై వెళ్లేవారిని కాపాడేంత మానవత్వం ఆశించడం అత్యాశే అవుతుందేమో..!
also read: saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య, రాజకీయ దుమారం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.