సమ్మెకు దిగిన ఆర్టీసి సిబ్బందిపై వేటు తప్పదు: సీఎం కేసీఆర్

ఆర్టీసి సిబ్బందిది ఘోర తప్పిదం: సీఎం కేసీఆర్

Last Updated : Oct 7, 2019, 08:56 AM IST
సమ్మెకు దిగిన ఆర్టీసి సిబ్బందిపై వేటు తప్పదు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న టిఎస్ఆర్టీసీ సిబ్బందిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగడం, అది కూడా పండగ సెలవులకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తూ సమ్మెకు దిగిన వారితో ఇకపై ఎలాంటి రాజీకి వచ్చే సమస్యే లేదని, వారు చేసింది ఘోరమైన తప్పిదమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు కూడా జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసి సమ్మెపై శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిన అనంతరం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిపై ఇక వేటు వేయడానికే నిర్ణయించుకున్నామని, దీంతో ఇక ఆర్టీసీలో మిగిలిన సిబ్బంది కేవలం 1200 మంది లోపేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తక్షణమే 2,500 బస్సులను అద్దెకు తీసుకొని నడపాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

భవిష్యత్తులో ఆర్టీసీలో క్రమశిక్షణారాహిత్యం, ఇలాంటి సందర్భాల్లో బ్లాక్‌మెయిల్ చేసే విధానం శాశ్వతంగా ఉండకూడదన్నా.. ఆర్టీసీ మనుగడ సాగించాలన్నా.. కొన్ని కఠినమైన నిర్ణయాలు, చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేసిన ఈ కీలక ప్రకటనపై ఆర్టీసి కార్మిక సంఘాలు ఏమని స్పందించనున్నాయో వేచిచూడాల్సిందే మరి.

Trending News