TS SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఓ స్పష్టత వచ్చింది. తెలంగాణలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 8 నుంచి యధావిధిగా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే, జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ఆ ప్రాంతాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించలేదు. ఆ ప్రాంతాల్లో పరీక్షలను వాయిందా వేయాల్సిందిగా హై కోర్టు తెలంగాణ సర్కారును ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ పరీక్షల నిర్వహణకు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని.. కోర్టు అనుమతిస్తే ఆ ప్రాంతాల్లోనూ పరీక్షలు పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టు అనుమతి కోరారు. ( Read also : Health tips: సమ్మర్‌లో ఇలాంటి డ్రింక్స్ తాగి చూడండి )
అయితే, నగరంలో కరోనావైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎవరైనా విద్యార్థి కరోనాతో చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటని కోర్టు నిలదీసింది. నష్టపోయిన విద్యార్థికి ఎన్ని కోట్లు ఇచ్చి ఆ నష్టాన్ని పూడ్చగలరని హై కోర్టు ప్రశ్నించింది. విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించిన హై కోర్టు.. ఎట్టి పరిస్థితుల్లోనూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా కరోనావైరస్ కారణంగా పరీక్షలకు హాజరు కాని విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతించాలని.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాల్సి ఉంటుందని హై కోర్టు షరతు విధించింది. పరీక్షలు చేపట్టనున్న ప్రస్తుత ప్రాంతాల్లోనూ కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. (Read also : Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
హై కోర్టు విధించిన షరతులకు లోబడే పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు కోర్టుకు చెప్పింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, సికింద్రబాద్ ప్రాంతాల్లో మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 8 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live link here..