Alabama Shooting News: బర్త్‌డే పార్టీలో కాల్పులు.. నలుగురి మృతి, 20 మందికిపైగా గాయాలు

Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 11:27 PM IST
Alabama Shooting News: బర్త్‌డే పార్టీలో కాల్పులు.. నలుగురి మృతి, 20 మందికిపైగా గాయాలు

Alabama Shooting News Updates: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లేలోని ఓ డాన్స్ స్టూడియోలో బర్త్ డే పార్టీలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారి సంఖ్య 20 మందికిపైనే ఉంటుందని తెలుస్తోంది. మహోగని మాస్టర్ పీస్ డాన్స్ స్టూడియోలో శనివారం రాత్రి 10.30 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు చోటుచేసుకున్న సమయంలో డాన్స్ స్టూడియోలో ఓ టీనేజర్ బర్త్ డే జరుగుతున్నట్టు సమాచారం.

కాల్పులకు దారితీసిన కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా అనే అంశంపై సైతం ఇంకా స్పష్టత రాలేదు. డేడ్‌విల్లేలో కాల్పుల ఘటనపై అలబామా గవర్నర్ కే ఇవీ స్పందిస్తూ.. ఇవాళ పొద్దున్నే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని.. డేడ్ విల్లే బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. దర్యాప్తు సంస్థలతో, అక్కడి అధికార యంత్రాంగంతో తాము ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కే ఇవీ స్పష్టంచేశారు.

డేడ్ విల్లెలో పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నప్పటికీ.. వివరాల పరంగా ఈ ఘటనకు సంబంధించి అనేక అంశాలపై స్పష్టత కొరవడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఇదిలావుంటే అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. దుండగుల రాక్షస క్రీడకు బలైన వారిలో భారీ సంఖ్యలో చిన్నారులు కూడా ఉన్నారు. అనేక సందర్భాల్లో దుండగులు పాఠాశాలలు, కాలేజీలు లాంటి విద్యా సంస్థల్లోకి చొరబడి కాల్పులు జరిపిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అమెరికా క్రైమ్ రికార్డ్స్ ప్రకారం అమెరికాలో కాల్పుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

Trending News