కరోనా వైరస్ (Coronavirus) కారణంగా సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మహమ్మారి వల్ల డెన్మార్క్ ప్రధాన మంత్రి (Prime Minister of Denmark) మెట్టే ఫ్రెడెరిక్సెన్ (Mette Frederiksen) ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల మూడుసార్లు ఆమె తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో జులైలో ఆమె వివాహం చేసుకోవాలనుకున్నారు.
వివాహం నిర్ణయించిన తేదిలో బ్రస్సెల్స్‌లో జరిగే యూరోపియన్ యూనియన్ సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. దీంతో నాలుగోసారి సైతం మెట్టే ఫ్రెడరిక్సెన్ తన వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మేరకు ఆమె తనకు కాబోయే భర్త ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఇలా రాశారు. ‘ఈ గొప్ప వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను.. కానీ అది అంత సులభం కాదు. పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినా.. అదే రోజు బ్రస్సెల్స్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాల్సి ఉంది.
నా మొదటి ప్రాధాన్యత విధులు నిర్వహించడం, కనుక పెళ్లిని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఆశిస్తున్నా.. Boతో ఎస్ చెప్పడానికి నిరాశతో ఎదురుచూస్తున్నా’ అని రాశారు. జులై 17,18న బ్రస్సెల్స్‌లలో జరిగే యూరోపియన్ కౌన్సిల్ సదస్సుకు 27దేశాల అధినేతలు పాల్గొననున్నారు.