భారతదేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానంలో ఎప్పుడూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దేశానికి గట్టి పోటీ ఇస్తోంది ఇరాన్. ప్రస్తుతం భారతదేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న ఇరాన్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పలు రాయితీలు కూడా ఇవ్వాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఇరాన్ మన దేశానికి ప్రతీ రోజు దాదాపు 5.67 టన్నుల ఆయిల్ సరఫరా చేసిందని అధికారిక అంచనా. అంటే దాదాపు 457,000 బ్యారెల్స్ అన్నమాట.
ఇటీవలే భారత ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, హిందుస్తాన్ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ దాదాపు ఇరాన్ నుండి 2017-18 సంవత్సరానికి 9.8 మిలియన్ టన్నుల ఆయిల్‌ను సరఫరా చేసుకున్నాయని అంచనా.
ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ చమురును ఇరాన్ భారతీయ కంపెనీలకు సరఫరా చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇటీవలే అమెరికా ఇరాన్‌తో 2005 న్యూక్లియర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాక.. పలు దేశాలు ఇరాన్ నుండి ఇక చమురు దిగుమతులు చేసుకోకూడదని భావిస్తున్నాయి. ఆ ఒత్తిడి భారత్ మీద కూడా ఉంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం మే నుండి ఇరాన్ నుండి మన దేశానికి వచ్చిన చమురు 16 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.
భారత్‌కు చమురు సరఫరాలో సౌదీకి పోటీ..?