84 ఏళ్ళ జపాన్ చక్రవర్తి అకితో పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో జపాన్ ప్రజలు ఆయన జన్మదినోత్సవానికి హాజరయ్యారు. ఇంకో రెండేళ్ళలో ఆయన పదవి నుండి తప్పుకుంటున్నందున.. ఈ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోక్యోలోని ప్రతిష్టాత్మక ఇంపీరియల్ ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఆ రోజును సెలవు దినంగా కూడా ప్రకటించారు. దాదాపు 55300 మంది కళాకారులు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
అకితో పాలించిన 29 ఏళ్ళ కాలంలో ఆయన పుట్టినరోజు వేడుకలకు భారీ స్థాయిలో ప్రజలు తరలి రావడం ఇదే తొలిసారి. తన పుట్టినరోజు సందర్భంగా అకితో తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. 2011 సంవత్సరంలో జరిగిన భూకంపంతో పాటు సునామీలో అసువులు బాసిన లక్షలమంది ప్రజలకు ఆయన నివాళులు అర్పించారు. అకితో పదవి నుండి తప్పుకున్నాక, ఆ బాధ్యతలను ఆయన కుమారుడు ప్రిన్స్ నరుహితో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అకితోకి గుండె ఆపరేషన్ కూడా జరిగింది.