ట్రంప్‌కు మరణశిక్ష విధించాల్సిందే

  

Last Updated : Nov 15, 2017, 08:20 PM IST
ట్రంప్‌కు మరణశిక్ష విధించాల్సిందే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరణశిక్ష విధించాల్సిందేనని ఓ ఉత్తర కొరియన్ పత్రిక విమర్శలు సంధించింది. తమ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ఈ మధ్య కాలంలో ట్రంప్ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. ఆయన తన పద్ధతి మార్చుకోకపోతే.. కిమ్ అభిమానులుగా తాము సహించమని ఆ పత్రికలో పేర్కొన్నారు. వీలైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ట్రంప్‌కు క్షమాభిక్ష లేని మరణశిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. అలాగే అదే పత్రిక ట్రంప్‌ను పిరికివాడిగా పేర్కొంది. దక్షిణ కొరియా సరిహద్దు పర్యటనకు రావాలనుకున్న ట్రంప్.. దానిని రద్దు చేసుకొని తన వైఫల్యమేమిటో చూపించకనే చూపించారని కూడా ఆ పత్రిక తెలిపింది. ఇటీవలి కాలంలో తన ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ తను ఎంచుకున్న కొన్ని దేశాలతో పాటు దక్షిణ కొరియాలో కూడా సంచరించారు. 

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడి మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ మీద కొన్ని నెగటివ్ వ్యాఖ్యలు చేశారు. అదే అంశాన్ని లేవనెత్తుతూ.. ఉ.కొరియా పత్రిక రొడొంగ్‌ సిన్‌ముణ్‌ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ లాంటి కుహనా మేధావులు ఈ ప్రపంచానికి అవసరం లేదని.. వారికి క్షమాభిక్ష కూడా పెట్టాల్సిన అవసరం లేదని.. వీలైతే మరణశిక్ష విధించాలని అభిప్రాయపడింది. తమ నాయకుడిని అవమానించడమంటే అది తమ దృష్టిలో తీవ్ర నేరమని.. ఆ నేరం చేసినందుకు గాను ట్రంప్‌కు శిక్ష విధించి తీరాలని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. 

Trending News