ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. మంగళవారం, బుధవారం ఆయన బిజీబిజీగా గడపనున్నారు. అందులో భాగంగా ఆయన సోమవారం రాత్రే హస్తినకు చేరుకున్నారు.
షెడ్యుల్‌లో భాగంగా.. చంద్రబాబు నాయుడు మంగళవారం పార్లమెంటుకు వచ్చారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్‌లీడర్లను కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలానే ఏపీకి జరిగిన అన్యాయంపై వివరించారు. ఏపీకి న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటంలో సహకరించి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరారు. ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, రాజీవ్ సాతీవ్‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అందిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ హౌస్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హోదా డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎంపీ శివప్రసాద్ జానపద నృత్యకారుడిగా దుస్తులు ధరించి, తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి నిష్క్రమించిన అనంతరం ఢిల్లీలో తన మొట్టమొదటి పర్యటన గురించి చర్చించడానికి అమరావతిలోని తన పార్టీ ఎంపీలు, వ్యూహరచక కమిటీలతో సోమవారం నాయుడు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే..!