కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు

Last Updated : Jan 6, 2019, 07:07 PM IST
కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి : కేంద్రం వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతలను పనిచేయాలని కోరితే, అందుకు ప్రతీకారంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు కలెక్టర్లు, నోడల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే వారిపై సీబీఐ కేసు పెట్టాడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ఎస్పీ, బీఎస్పీ నేతలపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలో అల్లర్లకు సైతం అక్కడి బీజేపీ నేతల వైఖరే కారణం అని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఏపీకి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర హక్కులను, ప్రయోజనాలను కేంద్రం కాలరాస్తోంది అని ఆవేదన వ్యక్తంచేసిన చంద్రబాబు.. కేంద్రం ఎన్ని విధాల అడ్డుపడినా, అవన్నింటినీ అధిగమించి అభివృద్ధిలో ముందుకు సాగిపోతున్నామని అన్నారు. ధర్మం మనవైపే ఉంది కనుకే ఎన్ని అవరోధాలు ఎదురైనా అన్నీ సానుకూల ఫలితాలే వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 

ఇదిలావుంటే, ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి చూపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నేడు ఏపీలోని అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాలకు చెందిన బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన మోదీ.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Trending News