రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన జనసందోహంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా వేదికపై ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రులున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ..మోదీని కొనియాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశ ప్రగతికి రథసారధి, గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోదీగారికి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, మనస్సు నిండా ఆప్యాయతలతో, చిక్కని చిరునవ్వులతో లక్షలాదిగా తరలివచ్చిన అక్కలు, అన్నదమ్ములు, అవ్వతాతలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున , ప్రజల తరపున ఉత్తరాంధ్ర ప్రజల తరపున విశాఖలో సాదరంగా, హృదయపూర్వకంగా రెండుచేతులతో స్వాగతం పలుకుతున్నాను..
ఇవాళ చారిత్రాత్మక ఏయూ ప్రాంగణంలో...ఓ వైపు సముద్రం, మరోవైపు జనసంద్రం కన్పిస్తోంది. కార్తీకపౌర్ణమి వేళ ఎగసిపడుతున్న కెరటాల్లా జన కెరాటాలు ఎగసిపడుతున్నాయి. ఏం పిల్లడూ వెళ్దమొస్తవా...అని వంగపండు చెప్పినట్టు ఉత్తరాంధ్ర జనం...తరలివచ్చారు.
శ్రీశ్రీ మాటల్లో...వస్తున్నాయ్...వస్తున్నాయ్.. జగన్నాధ రథచక్రాల్ వస్తున్నాయ్..మాటలు గుర్తొస్తున్నాయ్ ఈ జనం చూస్తుంటే. మహా కవి ఉత్తరాంధ్రకు చెందిన గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టికాదోయ్ అనే గురజాడ మాటలు కర్తవ్యబోధ చేస్తున్నాయి.
10,747 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సర్..ప్రజల ప్రభుత్వంగా పిల్లల చదువులు, వైద్య ఆరోగ్యం విషయంలో రైతుల సంక్షేమం విషయంలో సామాజిక న్యాయం విషయంలో మహిళా సంక్షేమంలో పాలనా వికేంద్రీకరణ విషయంలో ఈ మూడున్నరేళ్లుగా కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం తరపున మీ సహాయం అందించాలని కోరుతున్నాము.
8 ఏళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. మీరు చేసే ప్రతి ఒక్క సహాయం, ప్రతి రూపాయి,రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. సర్..మీరు మా రాష్ట్రం కోసం చేసే ఏ మంచైనా సరే ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదు , ఉండదు, ఉండబోదు. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుంచుకున్న ప్రజలు..మీరు పెద్ద మనస్సుతో చేసే సహాయాన్ని కూడా గుర్తుంచుకుంటారు.
రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా విభజన హామీల్నించి , పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ, విశాఖఫట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకూ చేసిన అన్ని విజ్ఞప్తుల్ని పరిగణలో తీసుకుని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. మా విజ్ఞప్తుల్నిపెద్దలైన మీరు సహృదయంతో స్వీకరించి పరిష్కరిస్తారని..సదా మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
Also read: PM Modi Speech: ఏపీ ప్రజలు స్వభావరీత్యా..ఎక్కడైనా స్థిరపడగలరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook