ప్రధాని అభ్యర్థులుగా చంద్రబాబు, కేసీఆర్, దేవెగౌడ?

ఫెడరల్ ఫ్రంట్  ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైనే.

Last Updated : Aug 5, 2018, 01:59 PM IST
ప్రధాని అభ్యర్థులుగా చంద్రబాబు, కేసీఆర్, దేవెగౌడ?

ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైనే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన ఫలితాలు రాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ దక్షిణాది నుంచి ప్రధాని పదవికి గట్టి పోటీదారులుగా ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే, తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. బీజేపీని ఓడించడానికి ప్రధాని పదవిని త్యాగం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఓడించటానికి ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని పదవికి ఆసక్తి లేదని చెప్పారు.

2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత.. చంద్రబాబు, కేసీఆర్ తమ తమ రాష్ట్రాలకు కుమారుల్ని సీఎం చేయాలని పార్టీల నుండి ఒత్తిడి వస్తోంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, బీజేపీ, కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికలలో టిఆర్ఎస్ 11 సీట్లు, టీడీపీ 16 సీట్లు గెలుచుకుంది (ఏపీలో 15, తెలంగాణలో ఒకటి).

కేసీఆర్, చంద్రబాబు ఈసారి కూడా ఇదే సంఖ్యలో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుపొందుతామని ఆశిస్తున్నారు. గతంలో చంద్రబాబు.. ఇతర పార్టీల మద్దతుతో ఐదేళ్లపాటు ప్రధాని పదవిని కొనసాగించడం కష్టమని... ఒకవేళ ప్రధాని పదవిని చేపట్టినట్లయితే..సంవత్సరం తరువాత ప్రధాని పదవిని కోల్పోయి 'మాజీ ప్రధాని' గా పిలువబడతానని.. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేనని.. తద్వారా రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లవుతుందని.. అందుకే ప్రధాని పదవిపై ఆసక్తి చూపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నమైనదని, ఈసారి అవకాశం వస్తే చంద్రబాబు ప్రధాని పదవిని తిరస్కరించలేరని ఓ టీడీపీ సీనియర్ నాయకుడు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రశేఖర్ రావు బీజేపీతో సాఫ్ట్‌గా వెళ్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తరువాత లోక్‌సభ ఫలితాల తర్వాత ఆయన వైఖరిలో మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని పదవి అన్న టాపిక్ వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కూడా బలమైన పోటీదారుగా ఉంటారని ఓ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు చెప్పారు.

Trending News