ఏపీ సీఎం చంద్రబాబు తన ఛాంబర్లో మంత్రులు, అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోటు ప్రమాదం అంశం చర్చకు వచ్చింది. ప్రమాదం జరగడానికి కారణాలను విశ్లేషిస్తూ... ఇందులో ప్రభుత్వ శాఖల వైఫల్యం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనితో ఏకీభవించిన సీఎం చంద్రబాబు.. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన మండిపడ్డారు. శాఖలు సరిగా పని చేయడం లేదన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా 22 మంది అమాయకుల ప్రాణాలు పోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిలకు చంద్రబాబు వార్నింగ్...
సంబంధిత శాఖల్లో ఏమైనా తప్పులు జరిగితే మంత్రులదే భాధ్యతని.. గతంలో శాఖాపరమైన బాధ్యతలకు మంత్రులు రాజీనామా చేసేవారని చెప్పిన చంద్రబాబు.. ఇంత మాత్రం శాఖలపై శ్రద్ధ వహించకపోతే ఎలా ... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం జరిగితే ఆ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అని సంబంధిత శాఖ మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
చంద్రబాబు ఉద్దేశం ఇదే...
బోటు ప్రమాదంపై చర్చ సందర్భంలో చంద్రబాబు స్పందించిన తీరును విశ్లేషిస్తూ అఖిలప్రియ రాజీనామా కోరారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వాస్తవానికి చంద్రబాబు ఉద్దేశం మాత్రం వేరొకటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ఎలా ఉండేవారో చేప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. తద్వారా మరింత బాధ్యతగా ఉండాలని అఖిలకు మందలించే విధంగా చంద్రబాబు వ్యవహరించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చంద్రబాబు ఆగ్రహం నేపథ్యంలో ఏమైనా జరగొచ్చా అనే చర్చ సాగుతోంది.
విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదనే..
బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందడంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై సీరియస్గా చర్చించారు. విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ఇ వ్వకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు బోటు ప్రమాదం అంశంసై ఈ స్థాయిలో మండిపడ్డారు.