ఆంధప్రదేశ్‌లో "ముఖ్యమంత్రి యువనేస్తం" వెబ్ సైట్‌ను సెప్టెంబర్ 14న ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పెన్షన్లు పొందేవారి పిల్లలకు సైతం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సులే కాకుండా.. డి ఫార్మసీ కోర్సు చదివిన వారిని కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
‘నిరుద్యోగ భృతి’ ఇచ్చేందుకు ఉపకరించే ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్‌ను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు యువతకు నిరుద్యోగ భృతి వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా నిరుద్యోగ భృతిని నేరుగా అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో వేస్తామని, ప్రజాసాధికార సర్వే ప్రకారం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కూడా ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే అప్రెంటీస్ కింద వివిధ సంస్థల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పంపిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
12.26 లక్షల మంది నిరుద్యోగులకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ సంకల్పించింది. యువ నేస్తం పథకం అమలు కోసం బడ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అభ్యర్థుల పేర్లను నమోదు చేయించడం కోసం ఒక వినూత్న వెబ్ సైట్ ఏర్పాటు చేయడంతో పాటు... అన్ లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ నెల 14వ తేది నుండి http://yuvanestham.ap.gov.in వెబ్ సైటులో నిరుద్యోగులు భృతి కోసం దరఖాస్తులు పంపించుకోవచ్చు.
నిరుద్యోగ భృతికి అర్హత ప్రమాణాలివే:
*దరఖాస్తుదారులు నిరుద్యోగులై మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి.
*కనీసం డిగ్రీ లేక పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
*4 చక్రాల వాహనాలు ఉండేవారు అనర్హులు. అయితే భూమి ఉండి ... ఆ భూమికి సాగునీటి సౌకర్యం ఉంటే.. అట్టి భూమి 2.5 ఎకరాలు లోపు ఉండాలి. అదే నీటి పారుదలలేని భూమి అయితే 5 ఎకరాలు లోపు ఉండాలి. అనంతపురం జిల్లాకి చెందినవారైతే సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 5 ఎకరాలు లోపు ఉండాలి. అదే నీటి పారుదలలేని భూమి అయితే 10 ఎకరాలు లోపు ఉండాలి.
*కులాల వారీగా రిజర్వేషన్ కోటా వర్తిస్తుంది.
*దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారు అర్హులు. ఒకే కుటుంబంలోని అన్ని అర్హతలు కలిగి ఉన్న వారందరూ ఈ పథకానికి లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోబడతారు
*22-35 సంవత్సరాల వయస్సులో ఉండాలి.
*స్వయం ఉపాధి కోసం రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాల నుంచి రూ.50,000 మించి ఋణం లేదా లబ్ధి పొందినవారు పథకానికి అర్హులుకారు
*కనీస విద్యార్హత లేనివారు (రెగ్యులర్ విద్యను అభ్యసిస్తున్నవారు).
*ప్రభుత్వం/ప్రైవేట్/ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగులు, స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు.
*ఏ కారణం చేతనైనా ప్రభుత్వ విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులు పథకానికి అర్హులుకారు.
*అభ్యర్ధి ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా నిర్ధారించబడి ఉండకూడదు.
*నిరుద్యోగ భృతి పొందేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదు చేసుకోవడానికి కావలిసిన ముఖ్య ధ్రువపత్రాలు - ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్.ఎస్.సి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్