విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. గురువారం నాటికి అది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ , తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ప్రసుత్తం వాయుగుండం కళింగపట్నంకి తూర్పు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయానికి వాయుగుండం మరింత బలపడనుంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రంలో అలల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉన్నందున సముద్రంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.