జూన్ 2, 2018 తేది నుండి ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో నవ నిర్మాణ దీక్ష చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దీక్షలో భాగంగా తొలి రోజు పర్యటనను విజయవాడ బెంజి సర్కిల్ నుండి ప్రారంభించనున్నారు. ఈ దీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి, కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి ప్రజలకు వివరించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
నవనిర్మాణ దీక్షలో భాగంగా గ్రామసభలకు కూడా పెద్దపీట వేయనున్నారు. జూన్ 8, 2018 తేది వరకు సాగే ఈ దీక్షలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఈ దీక్షలో భాగంగా తొలి రోజు జరిగే కార్యక్రమంలో విభజన చట్టం గురించి.. అది అమలైన విధానం గురించి ప్రజలకు తెలియజేయనున్నారు.
రెండవ రోజు దీక్షలో నీటి భద్రత గురించి, కరవు రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయనున్నారు. మూడవ రోజు రైతుల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి చర్చించనున్నారు. నాల్గవ రోజు మహిళా సంక్షేమం, ఆరోగ్య వికాసం లాంటి అంశాల మీద చర్చించనున్నారు. అయిదవ రోజు సీఎం పర్యటనలో నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి కల్పన లాంటి అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ఆరవ రోజు అమరావతి గురించి, రాష్ట్రంలో మౌళిక సదుపాయాల గురించి ఏపీ ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఆఖరి రోజు సుపరిపాలన గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు.