కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు కానీ.. : పవన్ కల్యాణ్

తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుడిని చూడలేకపోయాం : పవన్ కల్యాణ్

Last Updated : Mar 17, 2019, 06:16 PM IST
కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు కానీ.. : పవన్ కల్యాణ్

విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తాం అని ఒక తెలంగాణ నాయకుడు ప్రకటించారు కానీ మరి ఏ కారణం వల్లో తెలియదు కానీ అది జరగలేదని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తకుండానే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కూడా ప్రధానిగా చూడాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారు. అందులో తాను ఒకరిని అని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. తెలంగాణకు ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలిగా మాయావతిని చూడాలని జనసేన కోరుకుంటున్నట్టు పవన్ తేల్చిచెప్పారు. 

ఏపీలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించే క్రమంలో ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము లక్నోకి వెళ్లి కలిసినప్పుడు మాయావతి తమపై చూపించిన ఆప్యాయత, ప్రేమ చాలా కదిలించింది అని పవన్ తెలిపారు. మాయావతి గారిలో తనకు ఓ మాతృమూర్తి కనిపించారని పవన్ వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ గారితో కలిసి వెళ్లి ఆమెతో చర్చలు జరిపేందుకు భేటీ అయిన సందర్భంలో.. ఎన్నికల్లో ఎన్నిసీట్ల సర్దుబాటు అనే అంశంపైకన్నా ఎక్కువగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, నిరుద్యోగాన్ని ఎలా పారదోలాలి, నిరుపేదలకు ఏం చేస్తే బాగుంటుదనే అంశాలపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చడం తనకు ఎంతో నచ్చింది అని పవన్ వెల్లడించారు. బీఎస్పీ తరపున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Trending News