జనసేనాని పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి విశాఖపట్నం స్థానిక సమస్యల పై అవగాహన లేదని.. అలాంటప్పుడు తనకు తెలియని విషయాలు ఎలా ఆయన మాట్లాడతారని బండారు ప్రశ్నించారు. ముఖ్యంగా ముదపాక భూముల విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని ఆయన తేల్చి చెప్పారు.
"నా వద్ద కొన్ని కోట్ల రూపాయల డబ్బు మూలుగుతుందని పవన్ అన్నారు. కానీ నేను పాలిటిక్స్‌లోకి వచ్చాక ఆస్తులు అమ్ముకున్నాను తప్పితే కూడబెట్టలేదు. పవన్ నా పై ఆరోపణలు నిరూపిస్తే నేను ఎలాంటి శిక్షకైనా వెనుకాడను" అని బండారు సత్యానారాయణ మూర్తి అన్నారు. పవన్ కళ్యాణ్ స్క్రిప్టులు చదవడం మానేయాలని ఆయన ఈ సందర్భంగా జనసేనానికి హితవు పలికారు.
ముఖ్యంగా విశాఖలో కాలుష్యం పెరగడానికే నేనే బాధ్యుడిని అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని.. కానీ విశాఖ ఫార్మాసిటీలో ఫ్యాక్టరీలు వైఎస్ హయాంలోనే వచ్చాయని.. ఇదే ప్రశ్న ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోతున్నారని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం పద్ధతి కాదని ఆయన పవన్నుహెచ్చరించారు.