కేంద్రం దిగొచ్చేలా.. నేడు తిరుపతిలో ధర్మపోరాటం సభ

లక్షలాదిమంది సాక్షిగా మోదీ తీరును టీడీపీ ఎండగట్టనుంది.

Last Updated : Apr 30, 2018, 01:16 PM IST
కేంద్రం దిగొచ్చేలా.. నేడు తిరుపతిలో ధర్మపోరాటం సభ

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదంటూ తెలుగుదేశం పార్టీ 'ధర్మపోరాటం' పేరుతో తిరుపతిలో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ‘నమ్మక ద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం’  అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గళమెత్తనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో తారకరామ మైదానంలో ధర్మపోరాట సభ జరుగుతుంది.

లక్షలాదిమంది సాక్షిగా మోదీ తీరును టీడీపీ ఎండగట్టనుంది. ప్రధాని అభ్యర్థిగా నాడు నరేంద్ర మోదీ తిరుపతి వేదికగా రాష్ట్రానికి అనేక వరాలజల్లులు ప్రకటించారు. ప్రత్యేక హోదా హామీతో సహా అనేక హామీలిచ్చారు. ఢిల్లీకంటే మిన్నగా అమరావతి ఉండేలా తన వంతు కృషి చేస్తామని ఇదే వేదికగా 2014 ఏప్రిల్ 30న వాగ్దానం చేశారు.

ఎన్నికల గడిచి నాలుగేళ్లు పూర్తయినా.. నాటి హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తిరుపతి సభలో ముఖ్యమంత్రి ప్రజలకు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభకు రాష్ట్రంలోని తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నారు.  సోమవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ నాయకులు వెల్లడించారు.

Trending News