Niti Aayog Team meets AP CM YS Jagan: నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌లతో కూడిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి పలు అంశాలపై ముఖ్యమంత్రి, నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం చర్చించింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించిన సీఎం వైఎస్ జగన్.. నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖపట్నానికి చోటు కల్పించడం శుభపరిణామమని అని అభిప్రాయపడ్డారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ – సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్, డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్ ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో నిలపెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అంతేకాకుండా ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యరంగం, విద్యా రంగం, నాడు నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ప్రతీ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధ మరియు ప్రతినిధుల బృందం pic.twitter.com/4jdeTfO71b
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 1, 2023
ఏపీలో జరుగుతున్న అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు, పని తీరును నీతి ఆయోగ్ బృందం అభినందించింది అని ఏపీ సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదంతా కూడా సమగ్ర నివేదిక రూపంలో తమకు అందజేయాలని నీతి ఆయోగ్ బృందం ఏపీ ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం సీఎం జగన్ కి స్పష్టంచేసింది. నీతి ఆయోగ్ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పాల్గొన్నారు.