అమితాబ్ - ఒక నట ప్రభంజనం

                                                             

Last Updated : Oct 11, 2017, 06:51 PM IST
అమితాబ్ - ఒక నట ప్రభంజనం

భారతీయ సినిమాని ఒక నటుడిగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది.. హిందీ సినిమా చరిత్రను తనదైన శైలిలో తిరగరాసిన సూపర్ స్టార్... మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి శిఖరాయమానంగా వెలుగొందుతున్న అభినవ షెహన్ షా.. ఆయనెవరో కాదు.. నేటితో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న మేటి నటుడు, బిగ్ బి "అమితాబ్ బచ్చన్".. ఆయన జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీకోసం.

తల్లి ప్రోత్సహంతో.. 
11 అక్టోబరు 1942 తేదీన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ప్రాంతంలో ప్రముఖ హిందీ రచయిత హరివంశరాయ్ శ్రీవాస్తవ్, తేజీ దంపతులకు జన్మించిన అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. స్వతహాగా విప్లవ సాహిత్యమంటే ఎంతో ఇష్టపడే హరివంశరాయ్ తన కుమారుడుకి ఆ పేరు పెట్టుకున్నారు. ఇంక్విలాబ్ అంటే తెలుగులో "విప్లవం" అని అర్థం. కొన్నాళ్లు అదే పేరుతో చెలామణీ అయినా, స్కూలులో చేర్చేటప్పుడు తన స్నేహితుడు మరియు ప్రముఖ కవి సుమిత్రానందన్ పంత్ సూచన మేరకు తన కొడుకు పేరును అమితాబ్ అని మార్చారు ఆయన. అలాగే బచ్చన్ అనేది అమితాబ్ ఇంటి పేరు కాదు. హరివంశ రాయ్  శ్రీవాస్తవ "బచ్చన్" అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అదే పదం తర్వాత ఆయన కుటుంబీకులకు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. చిన్నప్పుడు నైనిటేల్‌లో చదువుకున్న అమితాబ్, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటికి చెందిన కిరోరిమల్ కళాశాలలో చదువుకున్నారు. అమితాబ్‌కు సినిమాల్లోకి రావడానికి తొలిసారిగా ప్రేరణను అందించింది అతని తల్లిగారే. నాటకాలంటే ఎంతో ఆసక్తిని కనబరిచే ఆమె, ఒకప్పుడు నటిగా కెరీర్ ప్రారంభించాలని భావించారట. కానీ వివాహమైపోవడంతో ఆమె కోరిక తీరలేదు. అందుకే పిల్లలు నాటకాల్లో నటిస్తామన్నప్పుడు ఆమె ప్రోత్సహించేవారు. అదే ఆసక్తి అమితాబ్‌కు సినిమా రంగంలో నటుడిగా రాణించడానికి కూడా తోడ్పడింది. 

సింగర్‌‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ
విచిత్రమేమిటంటే.. అమితాబ్‌కు తొలుత చిత్ర పరిశ్రమలో నటుడిగా అవకాశం రాలేదు. 1969లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన "భువన్ షోం" అనే చిత్రంలో ఆయన ఒక పాట పాడారు. ఆ తర్వాత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన "సాత్ హిందుస్తానీ" చిత్రంలో ఒక చిన్న పాత్ర ద్వారా తెరకు పరిచయమయ్యరు అమితాబ్. ఆ తర్వాత రాజేష్ కన్నాతో కలిసి నటించిన రెండవ చిత్రం "ఆనంద్" ఆయనలోని అసలైన  నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ చిత్రానికి ఆయన ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

ఆ తర్వాత,రేష్మా ఔర్ షేరా లాంటి చిత్రాల్లో విలన్ వేషాలు కూడా వేశారు అమితాబ్. అటువంటి సందర్భంలో ప్రకాశ్ మెహ్రా తాను దర్శకుడిగా అమితాబ్‌ను హీరోగా పెట్టి తీసిన "జంజీర్" చిత్రం ఆయనను ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. యాక్షన్ హీరోగా, యాంగ్రీ యంగ్ మేన్‌గా అమితాబ్ కనబరిచిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే సంవత్సరం అమితాబ్ నటించిన అభిమాన్, నమక్ హరాం చిత్రాలు కూడా విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఆ సమయంలో విడుదలైన దీవార్ చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది. అమితాబ్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. 

షోలే.. చరిత్రను తిరగరాసిన చిత్రం 
1975లో ధర్మేంద్రతో కలిసి అమితాబ్ నటించిన "షోలే" చిత్రం ఒక చరిత్రనే తిరగరాసింది. అమితాబ్ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత అమితాబ్ నటించిన అనేక చిత్రాలు వరుసగా సూపర్ హిట్స్ అయ్యాయి. అమర్ అక్బర్ ఆంథోనీ, డాన్, దోస్తానా, షాన్, కాలియా, సిల్ సిలా, శక్తి, షెషన్ షా అమితాబ్ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రాలుగా నిలిచాయి. అటువంటి సందర్భంలో 1983లో అమితాబ్  నటించిన "కూలీ" చిత్రం షూటింగ్ సందర్భంలో జరిగిన ఒక గాయం నుండి ఆయన కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత అడపాదడపా పలు చిత్రాలు చేస్తూ..  తిరిగి 1990లో అగ్నిపథ్ చిత్రం ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చారు అమితాబ్. నభూతో నభవిష్యత్.. అన్న స్థాయిలో ఉన్న అందులోని నటనకు ఆయన జాతీయ పురస్కారం పొందినా, ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.అటువంటి సందర్భంలో మల్టీస్టారర్ చిత్రం ఒకటి చేయాలని భావించిన అమితాబ్  దక్షిణాది నటుడు రజనీకాంత్, గోవిందాల కాంబినేషన్‌లో నటించిన "హమ్"  సూపర్ హిట్ అయ్యింది. 1997లో తేరే మేరే సప్నేగా చిత్రంతో నిర్మాతగా మారారు అమితాబ్. 

సెకండ్ ఇన్నింగ్స్
2001లో కభీ కుషీ కభీ గమ్ చిత్రంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించారు అమితాబ్. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన బాగ్ బన్, ఖాకీ, బ్లాక్, సర్కార్, చీనీ కమ్, భూత్ నాథ్, పా, బుడ్డా... హోగా తేరా బాప్ లాంటి చిత్రాలు ఆ వయసులో కూడా అమితాబ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచి, నేటి తరానికి కూడా దగ్గర చేశాయి. 2000లో అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి (కెబిసి) మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత అదే కార్యక్రమానికి సంబంధించి అనేక సీజన్స్‌కి కూడా తనే యాంకర్‌గా వ్యవహరించారు. 2001లో లగాన్ సినిమాతో, చలనచిత్రాలకు వ్యాఖ్యాతగా మారారు ఆయన. ఈ సినిమా చాలా పెద్ద హిట్. ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచి డాక్యుమెంటరీ మార్చి ఆఫ్ ది పెంగ్విన్స్ కు కూడా తన గాత్రం అందించారు అమితాబ్. 

మానవతా కోణం
అమితాబ్ అనేక సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటారు.2002లో  యునిసెఫ్ పోలియో నివారణ ప్రచారంలో భాగంగా అమితాబ్‌ను  ప్రచార రాయబారిగా నియమించింది.2013లో బాలికల అభ్యున్నతి కోసం పనిచేసే ప్లాన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు అమితాబ్ కుటుంబం రూ.25లక్షలు విరాళం ఇచ్చారు.అలాగే 2014లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో హెచ్ ఐవి/ఎయిడ్స్ పై విద్యాపరికరం తయారు చేసినప్పుడు టెక్ ఎయిడ్స్ సాఫ్ట్ వేర్ కు హిందీ, ఆంగ్ల భాషల్లో తన వాయిస్ ను రికార్డ్ చేసి, తన ఫోటోను పంపారు అమితాబ్.

అవార్డులు - రివార్డులు
1984లో భారత ప్రభుత్వం నుండి  పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు 

1991లో రాజ్ కపూర్ పేరు మీదుగా స్థాపించిన ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అమితాబ్

1999లో బిబిసి నిర్వహించిన యువర్ మిలీనియం అనే ఆన్ లైన్ పోల్ నిర్వహించినప్పుడు అమితాబ్ "గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్"గా ఎంపిక అయ్యారు

2000 ఫిలింఫేర్ అవార్డుల్లో సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం పురస్కారం పొందారు అమితాబ్.

2001లో ఈజిప్ట్ లో జరిగిన అలగ్జెండ్రియా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయ సినిమా రంగంలో అమితాబ్ చేసిన కృషికిగానూ శతాబ్దపు నటునిగా గౌరవం అందుకున్నారు. అదే సంవత్సరం భారత ప్రభుత్వం  పద్మభూషణ్ బిరుదుతో ఆయనను సత్కరించింది

2003లో ఫ్రెంచి పట్టణం డీవిల్లే హానరీ సిటిజన్ షిప్ కూడా అందుకున్నారు అమితాబ్

2004లో ఝాన్సీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందించింది

2006లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, లండన్ కు చెందిన డిమాంఫోర్ట్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. 

2013లో జోధ్ పూర్ జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందించింది

2015లో ఈజిప్ట్కు చెందిన కైరోలోని ఎకాడమీ అఫ్ ఆర్ట్స్ గౌరవ డాక్టరేటు అందించింది

Trending News