నటీనటులు – నయనతార, యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ తదితరులు
రచన, దర్శకత్వం – నెల్సన్
సంగీతం – అనిరుథ్
సినిమాటోగ్రఫీ – శివకుమార్ విజయన్
ఎడిటర్ – నిర్మల్
బ్యానర్ – లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్ – ఆగస్ట్ 31, 2018
ఒక్క పాట, ఒకే ఒక్క పాట కోకో కోకిల సినిమాను టాప్‌లో నిలబెట్టింది. దీనికి తోడు లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సినిమా. పైగా కోలీవుడ్‌లో ఇప్పటికే పెద్ద హిట్. ఇలాంటి సినిమా తెలుగులో వస్తోందంటే సహజంగానే అంచనాలుంటాయి. అలా ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
నాయుడుపేటలో ఓ పేద కుటుంబం. ఆ కుటుంబానికి కోకిలే దిక్కు. ఆమె జీతంపైనే కుటుంబం నెట్టుకొస్తున్న టైమ్‌లో హఠాత్తుగా కోకిల తల్లికి ఊపిరితిత్తుల కాన్సర్ అని తెలుస్తుంది. ట్రీట్మెంట్కు కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా ఓ మాదకద్రవ్యాల ముఠా, కోకిలకు పరిచయమవుతుంది. అలా కోకిల అనుకోకుండానే డ్రగ్స్ సరఫరా చేసే అమ్మాయిగా మారుతుంది.
కానీ పోలీసులకు విషయం తెలిసిపోతుంది. మాఫియాలోనే ఓ వ్యక్తి పోలీసులకు లీక్ చేస్తాడు. మరోవైపు అనుకోని పరిస్థితుల మధ్య డ్రగ్స్ మాఫియా నాయకుల్లో ఒకరిని కోకిల చంపేస్తుంది. ఓవైపు పోలీసులు, మరోవైపు మాఫియా.. వీళ్ల నుంచి కోకిల ఎలా తప్పించుకుంది. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనేదే మిగతా కథాంశం.
నటీనటుల పనితీరు :
పైన చెప్పుకున్న కథలో యోగిబాబు ప్రస్తావన లేదేంటి అని చూస్తున్నారా. నిజమే, ఈ కథకు యోగిబాబు అక్కర్లేదు. కోకిలను ప్రేమించే కిరాణాకొట్టు ఓనర్‌గా యోగిబాబు కనిపిస్తాడు. కథలో కామెడీ పండించే బాధ్యతను తీసుకున్న యోగి అక్కడక్కడ బాగానే నవ్వించాడు. కామెడీ కంటే, సూపర్ హిట్ సాంగ్‌లో ఇతడి హావభావాలే పెద్ద హైలెట్.
ఇక నయనతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డ్రగ్స్ సరఫరా చేసే అమాయకమైన కోకిల అనే అమ్మాయిగా నయన్ బ్రహ్మాండంగా నటించింది. తన అనుభవాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నయన్ లేకపోతే ఈ సినిమా లేదు. తనకున్న లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ను మరోసారి నిలబెట్టుకుంది నయన్.
నయన్, యోగిబాబుతో పాటు మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు. తెలుగు ఆడియన్స్‌లో కూడా పాపులర్ అయిన గుండు కమెడియన్ రాజేంద్రన్.. మరోసారి తన పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. డబ్బింగ్లో కూడా ఇతడికి మంచి టైమింగ్ కుదరడం విశేషం.
టెక్నీషియన్స్ పనితీరు:
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చక్కగా పేపర్ వర్క్ చేసుకొని సెట్స్‌పైకి వచ్చాడు. అతడి రైటింగ్ చాలా బాగుంది. ఎక్కడా తడబడకుండా సినిమాను తీశాడు. మరీ ముఖ్యంగా కోకిలకు, డ్రగ్స్ మాఫియాకు లింక్ పెట్టే సన్నివేశాల్లో ఇతడి టాలెంట్ కనిపిస్తుంది. ఇలాంటి కథల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అలా అంతా ఊహించే క్లయిమాక్స్‌లో కూడా తన మార్క్ రైటింగ్ చూపించాడు.
దర్శకుడికి అన్ని సాంకేతిక అంశాలు బాగా కలిసొచ్చాయి. ఈ విషయంలో అనిరుధ్‌కు వందకు వంద మార్కులు పడతాయి. మ్యూజిక్ డైరక్టర్‌గా ఫుల్‌ఫామ్‌లో ఉన్న అనిరుధ్.. ఒకే ఒక్క సాంగ్‌తో ఈ సినిమాను రిలీజ్‌కు ముందే హాట్ కేక్‌గా మార్చి తన బాధ్యతను తాను 100 శాతం నెరవేర్చాడు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దుమ్ముదులిపాడు. సినిమాలో 50శాతం సన్నివేశాలు ఇతడి రీ-రికార్డింగ్ ఎఫెక్ట్ వల్లనే ఎలివేట్ అయ్యాయి.
సినిమాటోగ్రాఫర్ విజయన్, ఎడిటర్ నిర్మల్ వర్క్ చాలా బాగుంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే లైకా ప్రొడక్షన్స్‌కు ఎక్కడా ఖర్చుపెట్టే ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు. ఈ కథకు తగ్గట్టు మాత్రమే ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి.
సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను స్మూత్‌గా చూపించండం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. సీరియస్ సబ్జెక్ట్‌కు కాస్త కామెడీ మిక్స్ చేసి, మ్యూజిక్ యాడ్ చేసి హిట్స్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అదే కోవలో కోలీవుడ్‌లో హిట్ కొట్టిన సినిమా కొలమావు కోకిల. కోకో కోకిలగా తెలుగులోకొచ్చిన ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్‌ను బాగానే ఎట్రాక్ట్ చేస్తుంది.
తండ్రి ఏటీఏం వాచ్‌మేన్, తల్లి క్యాన్సర్ పేషెంట్, చెల్లెలు కాలేజ్ స్టూడెంట్, ఓ పేద కుటుంబం, చిన్న ఉద్యోగం చేసుకుంటూ వీళ్లను పోషించే కోకిల అనే పాత్ర. ఇలాంటి సెటప్ మధ్యలోకి ఓ మాదక ద్రవ్యాల మాఫియా ప్రవేశిస్తే ఎలా ఉంటుంది!! అమాయకంగా కనిపించే కోకిల అమోఘమైన తెలివితేటలు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. ఫైనల్‌గా తనే గన్ పట్టుకుంటుందనే విషయాన్ని ఊహించగలమా! ఇలాంటి సస్పెన్స్, థ్రిల్ కోరుకునే వారికి కోకిల తెగ నచ్చుతుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ బోనస్ అన్నమాట.
నటించడానికి స్కోప్ ఉంటూ, తన చుట్టూ తిరిగే కథల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్న నయనతార మరోసారి కోకిలగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. సినిమా మొత్తానికి బ్యాక్‌బోన్ ఆమె. అమాయకమైన చూపులతో స్మగ్లింగ్ చేస్తూ, ఆ ఉచ్చు నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడే పాత్రలో బ్రహ్మాండంగా నటించింది.
కానీ టాలీవుడ్ ఆడియన్స్‌కు నయనతార పెర్ఫార్మెన్స్ మాత్రమే సరిపోదు కదా. అదే ఈ సినిమాలో పెద్ద మైనస్. మ్యూజిక్, నయనతార యాక్టింగ్, స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ.. సినిమాలో నేటివిటీ లేదు. మరీ ముఖ్యంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కామెడీ పండలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ప్రమోషనల్ సాంగ్‌ను కనీసం ఎండ్-టైటిల్స్‌లో కూడా చూపించకపోవడం వెలితి. ఈ నెగెటివ్ ఎలిమెంట్స్ మినహాయిస్తే సినిమా అంతా ఓకే.
నయనతారకు తమిళనాట ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ కారణంగా కోకోకోకిల అక్కడ ఇప్పటికే రూ. 20 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్‌కు అంత హైప్ రాదు కానీ ఉన్నంతలో ఈ సినిమా ఎక్కడా నిరాశపర్చదు. మరీ ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే, కోకోకోకిల సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ – 2.75/5
జీ సినిమాలు సౌజన్యంతో...