ముఖేశ్ అంబానీ నిర్మాతగా మారనున్నారు. ఓ భారీ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వంద..రెండొందలు కోట్లు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో తెరకెక్కించడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ఆ సినిమా ఎదో? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ 'మహాభారతం' తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. మహాభారత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. కానీ దీనిని సినిమాగా తెరకెక్కించడానికి 15-20 ఏళ్లు పడుతుందని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఈ సినిమాకు సహ నిర్మాతగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారట. సుమారు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌తో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు యోచిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే అంతర్జాతీయ రచయితల చేత స్టోరీ రాయిస్తున్నట్లు సమాచారం.
మరోపక్క మలయాళంలో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రచయిత వాసుదేవన్ నయర్ రచించిన 'రాందమూళం' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు మోహల్‌లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడి పాత్ర కోసం అక్కినేని నాగార్జునను సంప్రదించారు.
సుకుమారన్ కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. 2020లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది.
టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కూడా మహాభారతాన్ని తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. మహాభారతం తీయాలనే ఆలోచన రాజమౌళికి ఉంది కానీ..ఆది ఇప్పట్లో జరగదని ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.