పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది అంతా మెగా హీరోలదే హవా. 2018 మేడ్ ఫర్ మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి. ఒక రకంగా ఇది వరల్డ్ రికార్ట్. ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన నటీనటులు ఇలా ఒకే ఏడాది వరుస పెట్టి థియేటర్లలోకి రాలేదు. ఈ ఫీట్ ఒక్క మెగా ఫ్యామిలీకే సాధ్యమైంది.
సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఈ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీ నటీనటుల సినిమాలు టాలీవుడ్ లో సందడి చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. అందరికంటే ముందు ఈ ఏడాది జనవరి 10న ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్ కల్యాణ్. సినిమా రిజల్ట్ తేడాకొట్టినా మెగా దండయాత్ర మాత్రం ఆగలేదు.
ఆ వెంటనే ‘ఇంటిలిజెంట్’ రూపంలో మరో సినిమా వచ్చింది. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇందులో హీరో. ఈ సినిమా వచ్చిన షార్ట్ గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ నుంచి మరో సినిమా వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చేసిన ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ అయింది
ఈ హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ తర్వాతి నెల మార్చిలో రామ్ చరణ్ ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఫస్ట్ రెండు మూవీలు ఫెయిల్ అయితే, నెక్స్ట్ రెండు సినిమాలు హిట్ అయ్యి మెగా అభిమానుల్లో సంతోషం నింపాయి.
ఇక సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేసింది కూడా మెగా కాంపౌండే. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య గ్రాండ్ గా విడుదలైంది. మే 4న వచ్చిన ఈ సినిమా నటన పరంగా స్టైలిష్ స్టార్ ను మరో మెట్టు పైన నిలబెట్టింది.
ఇదే ఏడాది మరో సినిమాతో మెరిశాడు సాయిధరమ్ తేజ్. ‘ఇంటిలిజెంట్’ విడుదలైన కొన్ని నెలలకే ‘తేజ్ ఐ లవ్ యూ’తో థియేటర్లలోకి వచ్చాడు. జులై 6న విడుదలైంది ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమా. ఈమధ్యలో మరో మెగా హీరో అల్లు శిరీష్ నటించిన ‘యుద్ధభూమి’ కూడా వచ్చింది.
ఇక మెగా ఫ్యామిలీ అంతా.. ముఖ్యంగా మెగాస్టార్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అల్లుడిగారి అరంగేట్రానికి కూడా ఈ ఏడాదే వేదికైంది. మామ సినిమా టైటిల్ తో అల్లుడు కల్యాణ్ దేవ్.. ‘విజేత’గా థియేటర్లలోకి వచ్చాడు. ఈ మూవీకి కొనసాగింపుగా మెగా ప్రిన్సెస్, నాగబాబు కుమార్తె నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మెగా బ్రదర్ నాగబాబు. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఏడాదే వరసబెట్టి వస్తే తానెందుకు వెనకాడాలనుకున్నాడో ఏమో ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాతో నాగబాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ మెగా బ్రదర్ ని ఓ పవర్ ఫుల్ రోల్ లో ప్రజెంట్ చేస్తున్నాడు.
సో.. మెగా ఫ్యామిలీలో నటుడు లేదా నటి అనిపించుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఏడాది తమ సినిమాలను దించేశారు. ఒక్క మెగాస్టార్ తప్ప. 2018 మెగా ఫ్యామిలీ ప్యాకేజ్ లో మెగాస్టార్ లేకపోవడమే అతి పెద్ద లోటు. ఇదొక్కటి తప్ప ఆల్ హ్యాపీస్.