World Liver Day 2023: ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day) గా జరుపుకుంటున్నాం. లివర్ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుతున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉంచుకుంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామని అని చెబుతున్న రెనోవా_ఎన్ ఐ జి యల్ హాస్పిటల్స్ కు చెందిన డైరక్టర్ & సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్ డాక్టర్. ఆర్ వి రాఘవేంద్రరావు వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే..
జీర్ణ వ్యవస్థ లో లివర్ ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడివైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలకపాత్ర పోషించటంతో పాటు ప్రోటీన్ సంశ్లేషణ, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగపడుతుంది. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో లివర్ వ్యాధిగ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కారణాల్ని గుర్తించారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవటం, క్యాన్సర్, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. వీటిలో అనేక సమస్యలను మందులతో పరిష్కరించవచ్చును. కానీ కొన్ని సమస్యలకు మాత్రం సర్జికల్ పరిష్కారాలు అవసరం అవుతుంటాయి. వీటిలో ప్రధానమైనవి మూడు… 1. లివర్ సిస్ట్ లు 2. గాల్ బ్లాడర్ లేదా బైల్ డక్ట్ స్టోన్ లు 3. లివర్ క్యాన్సర్.
1) లివర్ సిస్టు లు:
లివర్ లోపల పుట్టుకతోటే కొందరికి ఈ సిస్టులు వస్తాయి. ఇవి చిన్నవిగా ఉండి 1, 2 ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనేక నీటిబుగ్గలు ఉంటాయి. ఈ సిస్టులు లివర్ మొత్తం వ్యాపించినట్లయితే అడల్ట్ పాలీసిస్టిక్ లివర్ డిసీజెస్ అని పిలుస్తారు. ఈ సందర్భాలకు పుట్టుకతో వచ్చే జన్యులోపాలు కారణం కావచ్చు. కొన్ని సార్లు మాత్రం పరాన్న జీవుల ఇన్ ఫెక్షన్ తో సిస్టులు ఏర్పడుతాయి. మరి కొన్ని సందర్భాల్లో చీము గడ్డలు కూడా ఈ సిస్టుల మాదిరిగా కనిపిస్తాయి. కొన్ని రకాల లివర్ క్యాన్సర్ లు కూడా ఈ సిస్టులు మాదిరిగా కనిపిస్తాయి.
ప్రాథమిక స్థాయిలో ఈ సిస్టులను అల్ట్రా సౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చును. సీటీ స్కాన్, ఎమ్ ఆర్ ఐ స్కాన్ లను చేయించినట్లయితే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. లివర్ సిస్టుల సైజు, విస్తరణను గమనించి దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా వరకు లాపరోస్కోపిక్ విధానాలతో ట్రీట్ మెంట్ చేయడానికి వీలవుతుంది.
2. గాల్ బ్లాడర్ లేదా బైల్ డక్టు ల్లో స్టోన్ లు:
లివర్ పనిచేసే క్రమంలో లివర్ నుంచి విడుదల అయ్యే జ్యూస్ బైల్ గొట్టాల ద్వారా ప్రయాణిస్తుంది. బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్ లలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. చాలా సార్లు ఇన్ ఫెక్షన్ ఇందుకు కారణంగా నిలుస్తుంది. కొలెస్టరాల్ పెరగటం, అధిక బరువు తో పాటు కొన్ని హెల్మింథియల్ ఇన్ ఫెక్షన్ లు కూడా కారణం కావచ్చును. కొన్ని సార్లు పుట్టుకతో వచ్చిన వాపుతో వస్తుంటాయి.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
జాండీస్ తో పాటు కడుపులో కుడివైపు నొప్పి, చలితో కూడిన జ్వరాలు వంటివి ప్రాథమిక లక్షణాలుగా గుర్తించవచ్చు. ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ప్రాథమిక రక్తపరీక్ష (ఎల్ ఎఫ్ టి) , అల్ట్రా సౌండ్ స్కానింగ్ లతో రోగ నిర్ధారణ చేయవచ్చు. అవసరాన్ని బట్టి ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ చేయవచ్చు.
ఆధునిక టెక్నాలజీ చికిత్సలు:
బైల్ డక్ట్ లు, గాల్ బ్లాడర్ లలో సమస్యలను గుర్తించేందుకు ఎండోస్కోపిక్ అల్ట్రా సౌండ్ చాలా బాగా ఉపయోగపడుతోంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా సునిశితమైన పరిశీలన చేసేందుకు వీలవుతుంది. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ను లాపరోస్కోపిక్ పద్దతులతో ఆపరేషన్ చేసి తొలగించేందుకు వీలవుతుంది. బైల్ గొట్టాలలో ఏర్పడే స్టోన్స్ ను ఆపరేషన్ లు అవసరం లేకుండా ఎండోస్కోపీ విధానాలతో పరిష్కరించవచ్చు. లిథో ట్రిప్సీ మరియు ఈ ఆర్ సి పి పద్దతులతో స్టోన్స్ ను పూర్తిగా తొలగించవచ్చును. కొన్ని ప్రత్యేక సందర్భాలలో హెపాటిక్ జెజునెస్టమీ ఆపరేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
3. లివర్ క్యాన్సర్:
లివర్ లో అవాంఛిత కణజాలం పేరుకొని పోయి కణితులుగా మారతాయి. చాలా సందర్భాల్లో ఈ కణితులు క్యాన్సర్ కణితులు కాకపోవచ్చును. కొన్ని సందర్భాల్లో మాత్రం క్యాన్సర్ కణితులు ఏర్పడుతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్ ను హెపటో సెల్యులార్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకొనే వారిలో ఏర్పడుతుంది. హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ ఇన్ ఫెక్షన్ తో ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లో ( 3నుంచి 7 సంవత్సరాల వయస్సు పిల్లలు) క్యాన్సర్ కనిపిస్తుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. కొన్నిసందర్భాలలో లివర్ లోనే క్యాన్సర్ ఏర్పడవచ్చు. లేదా జీర్ణ వ్యవస్థ లోని ఇతర భాగాల్లో లేదా ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్ జనించి కాలేయంలోకి పాకవచ్చు.
ఆధునిక పరిష్కారాలు:
కడుపు పైభాగంలో నొప్పి తో పాటు బరువు తగ్గటం వంటి లక్షణాలతో గమనించవచ్చు. పసిరికలు, నల్ల విరేచనాలు వంటివి కూడా కనిపిస్తుంటాయి. ప్రాథమిక దశలో గుర్తించకపోతే సమస్య ముదిరిపోయాక ఇబ్బంది అధికం అవుతుంది. ప్రాథమికంగా రక్తపరీక్ష (ఎ ఎఫ్ పి), అల్ట్రా సౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించినప్పుడు హెపటెక్టమీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే క్యాన్సర్ సోకిన కణజాలాన్ని గుర్తించి, ఆపరేషన్ ద్వారా ఆ భాగాన్ని మొత్తంగా తొలగించటం అన్న మాట. ఈ ఆపరేషన్ చేయలేని పరిస్థితులు లేదా పేషంట్ ఆపరేషన్ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితుల్లో ... ప్రత్యేక విధానాలు అయిన టేస్ మరియు అబ్లేషన్ విధానాలు అవలంబించాల్సి ఉంటుంది. వీటిలో మైక్రో వేవ్ అబ్లేషన్ అన్నది చాలా మెరుగైన చికిత్స విధానం అనుకోవచ్చు.
జాగ్రత్తలు:
అనేక రకాల లివర్ సమస్యలను క్రమబద్దమైన జీవన సరళి, చక్కటి ఆహారపు అలవాట్లతో నివారించవచ్చు. మద్యపానానికి దూరంగా ఉండటం, హెపటైటిస్ వ్యాక్సీన్ లు తీసుకోవటం ద్వారా లివర్ వ్యాధులను నివారించుకోవచ్చు.
డాక్టర్. ఆర్ వి రాఘవేంద్రరావు
డైరక్టర్ & సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్
రెనోవా_నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్
బంజారాహిల్స్, హైదరాబాద్.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook