శివపురి: ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో శవానికి చీమలు ఎక్కిన వైనం అక్కడి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువటద్దంలా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలచంద్ర లోథి అనే 50 ఏళ్ల వ్యక్తి టీబీ రోగి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లోథి మృతి చెందినట్టు సమాచారం తెలిసిన తర్వాత కూడా అతడి శవంపై డాక్టర్లు దృష్టిసారించలేదని.. అంతేకాకుండా అతడు చనిపోయిన తర్వాత కూడా పలువురు రోగులు ఆ వార్డులో చికిత్స నిమిత్తం చేరారని మెడికోలు తెలిపారు. దీంతో లోథి మృతి అనంతరం మృతదేహాన్ని భద్రపర్చడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శవానికి చీమలు ఎక్కినట్టు తెలుస్తోంది.
శవానికి చీమలు ఎక్కిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సర్కార్.. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఐదుగురు డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సస్పెండ్ అయిన వారిలో ఓ సర్జన్ కూడా ఉన్నారు.