సార్.. ఆశీర్వదించండి..
మోదీజీ మనసారా దీవించండి..
ఎన్నికలైపోయాయి.. ఇక రాజకీయాల్లేవ్..
నేను అందరివాడిని.. అన్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారందరితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.
#WATCH Arvind Kejriwal takes oath as Chief Minister of Delhi for a third term pic.twitter.com/C66e3cgxXw
— ANI (@ANI) February 16, 2020
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఐతే ఆయన చాలా బిజీగా ఉండి రాలేకపోయారేమో అన్నారు. రామ్ లీలా మైదాన్ నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
'ఉచితం'పై ఉన్నతంగా వివరణ
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘన విజయం కట్టబెట్టినందుకు ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విపక్షాలపై కాస్త చురకలు అంటించారు కేజ్రీవాల్. 'ఉచితం' అంటే కేజ్రీవాల్ .. కేజ్రీవాల్ అంటే 'ఉచితం' అని ప్రచారం చేస్తున్న విపక్షాలకు వెరైటీగా సమాధానం చెప్పారు. ప్రపంచంలో ప్రకృతి అందరికీ అన్నీ ఉచితంగా ఇస్తుందన్నారు. అంతే కాదు మాతృప్రేమ, తండ్రి ఆశీర్వాదం ఉచితంగా దొరుకుతుందన్నారు. అలాగే కేజ్రీవాల్ ప్రేమ కూడా ఢిల్లీ వాసులపై ఉచితంగానే కురుస్తుందని తెలిపారు.
నేను అందరివాడిని..
మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ .. కాస్త ఉన్నతంగానూ మాట్లాడారు. ఎన్నికలుక పూర్తయ్యాయి. ఎవరు ఎవరికి ఓటేశారు. ఎవరు ఎవరెవరి ఓటు వేయలేదు... దీన్నంతా పక్కకు పెట్టేయాలన్నారు. తాను మాత్రం కుల, మత, ప్రాంత విభేదాలు పక్కన పెట్టి ఢిల్లీ వాసుల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ అయినా .. కాంగ్రెస్ అయినా తనకు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. తాను అందరివాడిని అన్నారు అరవింద్ కేజ్రీవాల్.