పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. బుధవారం జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, మార్చి 26న జరిగిన 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్ఈ ఈ తాజా ప్రకటనలో పేర్కొంది. "పరీక్షల నిర్వహణ అనంతరం చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా పరీక్షల జరిగిన తీరుపై విచారణ జరిపిన బోర్డు.. ఈ రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని అంతిమ నిర్ణయానికొచ్చింది. అయితే, ఈ రెండు పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే తేదీల విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదని, త్వరలోనే ఆ తేదీల వివరాలను సైతం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ www.cbse.nic.in పై వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.
CBSE will conduct re-examination of Maths paper for class X and Economics paper of class XII. #boardexams pic.twitter.com/RCOwqRt6EZ
— ANI (@ANI) March 28, 2018
ఈ ఏడాది 28 లక్షలకుపైగా స్టూడెంట్స్ సీబీఎస్ఈ పరీక్షలకు హాజరవుతుండగా వారిలో 16,38,428 మంది అభ్యర్థులు 10వ తరగతికి, 11,86,306 మంది అభ్యర్థులు 12వ తరగతి పరీక్షలకు నమోదు చేసుకున్నారు. 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలపై సోమవారమే స్పందించిన సీబీఎస్ఈకి చెందిన ఓ సీనియర్ అధికారి.. లీకేజీ వ్యవహారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.