2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు భారీ నజరానాను ప్రకటించేందుకు మోదీ సర్కార్ సిద్దమైనట్లు సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62కు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందే కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62కి పెంచే అవకాశం ఉంది.
దీంతో పాటు 7వ వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకొని 25 శాతం జీతాలను కూడా పెంచాలని మోదీ సర్కార్ భావిస్తోందట. వీటితో పాటు అవినీతి కేసుల విచారణలో నిబంధనలను సులభతరం చేయడం, ఎల్టీసీ కింద విదేశీయానానికి వెళ్లేందుకు అవకాశమివ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
7వ వేతన సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవడం వల్ల జీతాలు అనుకున్నట్లు పెరగలేదని..ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం..దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జీతాలను పెంచడం, రిటైర్మెంట్ వయస్సును పెంచడం లాంటివి చేస్తే.. ఎన్నికల్లో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.