EXCLUSIVE: హృతిక్ రోషన్‌నే మెప్పించిన.. లెక్కల మాస్టారి "సూపర్ 30" కథ

ఆనంద్ కుమార్.. ప్రస్తుతం ఉత్తరాదిలో గణిత విద్యార్థులందరూ జపం చేస్తున్నపేరు ఇది. శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకొని గణితశాస్త్రం పై ఆసక్తి పెంచుకున్న ఈ బీహార్ యువకుడు పేదరికం వల్ల కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో సీటు వచ్చినా వదులుకున్నాడు. అలా సీటు వదులుకున్న రోజే ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు.

Edited by - Babu Koilada | Last Updated : Mar 28, 2018, 05:56 AM IST
    • సూపర్ 30 పేరుతో ఏటా ముప్పై మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఆనంద్ కుమార్
    • ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది
    • పేదరికం వల్ల కేంబ్రిడ్జ్‌లో చదువుకొనే అవకాశం కోల్పోయారు ఆనంద్
EXCLUSIVE:  హృతిక్ రోషన్‌నే మెప్పించిన.. లెక్కల మాస్టారి "సూపర్ 30" కథ

ఆనంద్ కుమార్.. ప్రస్తుతం ఉత్తరాదిలో గణిత విద్యార్థులందరూ జపం చేస్తున్నపేరు ఇది. శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకొని గణితశాస్త్రం పై ఆసక్తి పెంచుకున్న ఈ బీహార్ యువకుడు పేదరికం వల్ల కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో సీటు వచ్చినా వదులుకున్నాడు. అలా సీటు వదులుకున్న రోజే ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు.

తనలాగే గణితమంటే ఆసక్తి ఉండి.. పేదరికం వల్ల చదువుకోలేకపోతున్న విద్యార్థులకు సహాయం చేయాలని భావించాడు. ఆ ఆలోచన నుండి పుట్టిందే "సూపర్ 30". గణితమంటే ఆసక్తి ఉండి.. పేదరికం వల్ల చదువుకోలేకపోతున్న విద్యార్థులను ప్రతీ సంవత్సరం 30 మందిని ఎంట్రెన్సు టెస్టు ద్వారా ఎంపిక చేసి.. వారికి తగు శిక్షణ ఇచ్చి.. ఐఐటిల్లో సీటు తెప్పించడమే "సూపర్ 30" లక్ష్యం. ఇలా ఇప్పటి వరకూ 450 మంది విద్యార్థులకు ఆనంద్ శిక్షణ ఇవ్వగా.. అందులో 395 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీటు సంపాదించారు. 

ఒక మ్యాథ్స్ ట్యూషన్ సెంటర్ పెట్టుకొని.. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోటే సంవత్సరానికి 30 మంది పేద విద్యార్థులకు గణితంలో శిక్షణ ఇస్తున్నారు ఆనంద్. ఆనంద్ కథ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆయన కథతో హృతిక్ రోషన్ హీరోగా "సూపర్ 30" పేరుతో ఓ చిత్రం కూడా తెరకెక్కనుంది. ఇటీవలే జీన్యూస్ ఆన్ లైన్ విభాగం "టౌన్ హాల్" పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆనంద్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. 

మరిచిపోలేని సంఘర్షణ
జీన్యూస్‌తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ కుమార్ తన బాల్యంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. తన తండ్రి ఓ పోస్టల్ ఉద్యోగి అని, తనను చదివించడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారని ఆయన అన్నారు. తనకు చిన్నప్పటి నుండీ సైన్సు ప్రాజెక్టులు చేయడమంటే ఎంతో ఇష్టమని.. ఏ విషయాన్నైనా కుతూహలంగా నేర్చుకోవాలనే తపన ఉండేదని 
తెలిపారు.

అయితే తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే తనకు గణితమంటే ఎంతో ప్రేమ, ఇష్టం పెరిగాయని చెబుతూ.. అటువంటి సందర్భంలో తన తండ్రి గుండెపోటుతో మరణించడం తన జీవితాన్ని మార్చేసిందని.. అది ఒక రకంగా తన జీవితంలో అతి పెద్ద సంక్షోభమని అన్నారు. తాను గణితంపై రాసిన అనేక వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని..1994లో కేంబ్రిడ్జ్‌లో చదువుకొనేందుకు అవకాశం కూడా వచ్చిందని.. అయితే పేదరికం వల్ల.. డబ్బు లేకపోవడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయానని ఆనంద్ తెలిపారు

చదువు కోసం.. అప్పడాల విక్రయం
తండ్రి చనిపోయాక.. తల్లి తమను పోషించడానికి, చదివించడానికి అప్పడాలు తయారు చేసి విక్రయించేవారని ఆనంద్ తెలిపారు. తాను కూడా తన సోదరుడితో కలిసి వాటిని షాపుల్లో విక్రయించేవాడినని ఆనంద్ తెలిపారు. తన చదువు పూర్తయ్యాక.. ఏమి చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో తన టాలెంట్‌నే పెట్టుబడిగా పెట్టి.. మ్యాథ్స్ ట్యూషన్ సెంటర్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆనంద్ అన్నారు. తన ట్యూషన్ సెంటర్ ద్వారా మంచి ఆదాయం పొందాక ఇక వెనుదిరిగి చూసుకోలేదని ఆయన చెప్పారు.

అయితే అలా వచ్చిన ఆదాయంలో కొంత మంచి పనికి ఉపయోగించాలని భావించానని.. అందుకే  సూపర్ 30 పేరుతో ఒక సంస్థను స్థాపించానని తెలిపారు ఆనంద్. "సూపర్ 30 ఎంపిక చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యార్థులకు తొలుత ఎంట్రన్స్ టెస్టు పెడతాం. అలా టెస్టులో పాసైనవారిలో 30 మందిని ఎంపిక చేస్తాం. వారికి ఎలాగైనా ఐఐటిల్లో సీటు తెప్పించే లక్ష్యంతో సూపర్ 30 పనిచేస్తుంది. పూర్తి సరళమైన పద్ధతుల ద్వారా... కాస్త వినోదాన్ని మేళవించి.. స్నేహపూర్వకమైన రీతిలో.. ప్రాక్టికల్‌గా గణితాన్ని విద్యార్థులకు నేర్పించడానికి సూపర్ 30 టీమ్ పనిచేస్తుంది" అన్నారు ఆనంద్

రాజకీయాలంటే ఆసక్తి లేదు
విద్యార్థులు గణితంలో మేటిగా రాణించేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్న ఆనంద్‌ను ప్రశ్నిస్తూ.. మీ లాంటివారు రాజకీయాల్లోకి వస్తే.. విద్యావ్యవస్థను మార్చే అవకాశం ఉంటుంది కదా.. అంటే ఆయన నవ్వుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు. కీర్తిని పొందాలంటేనే రాజకీయాలలోకి రావాలని.. కానీ తనకు ఆ యోచన లేదని అన్నారు. తాను చేస్తున్నదాంట్లోనే ఎంతో సంతృప్తి ఉందని  ఆయన చెప్పారు. నేడు ముఖ్యంగా రాజకీయాల్లో కులం, మతం ప్రాతిపదికిన పనులు జరుగుతున్నాయని.. అందుకే తాను అటువైపు వెళ్లాలని భావించడం లేదని తెలిపారు. తాను ఎంట్రస్టు  టెస్టు పెట్టి విద్యార్థులను ఎంపిక చేసినప్పుడు కూడా ఎప్పుడూ టాలెంట్‌‌నే పరిగణనలోకి తీసుకున్నానని.. ఎప్పుడూ కుల,మతాల జోలికి పోలేదని ఆనంద్ ఈ సందర్భంగా చెప్పారు. 

ప్రస్తుతం ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా "సూపర్ 30" అనే చిత్రం హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కుతోంది. వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Trending News