భారత్‌‌లో ఉగ్రదాడులకు కుట్ర.. పలు నగరాల్లో హై అలర్ట్ !

భారత్‌‌లో ఉగ్రదాడులకు కుట్ర.. పలు నగరాల్లో హై అలర్ట్  ! 

Last Updated : Sep 26, 2019, 09:47 AM IST
భారత్‌‌లో ఉగ్రదాడులకు కుట్ర.. పలు నగరాల్లో హై అలర్ట్ !

జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్‌లోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయా వైమానిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. 8-10 మంది ఉగ్రవాదులు శ్రీనగర్, అవంతిపుర, జమ్మూ, పటాన్‌కోట్, హిందోన్ వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖను హెచ్చరించింది. జైషే మహ్మద్ ఉగ్రవాదుల కదలికలు, కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఓ కన్నేసిపెట్టిన తర్వాతే నిఘావర్గాలు ఈ హెచ్చరికలు జారీచేశాయి. 

పాకిస్తాన్ నుంచి పంజాబ్‌కి డ్రోన్ల సహాయంతో ఇప్పటికే ఆయుధాలు తరలించారని, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఐఎస్ఐ ఈ ఆయుధాల రవాణాకు సహకరించాయని తెలుస్తోంది. నిఘావర్గాలకు అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 15 తేదీల్లో మొత్తం ఎనిమిదిసార్లు ఆయుధాల రవాణా జరిగిందని, ఆ ఆయుధాలు ఉపయోగించే భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడాలని జైషే మహ్మద్ వ్యూహరచనలు చేస్తోందని నిఘావర్గాలు వెల్లడించాయి. 

పుల్వామా దాడికి నిరసనగా ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసంచేసిన సంగతి తెలిసిందే. అయితే, బాలాకోట్ స్థావరం మళ్లీ చురుకుగా పనిచేస్తోందని, సరిహద్దులు దాటి భారత్‌లోకి రావడానికి దాదాపు 500 మంది ఉగ్రవాదులు అక్కడ సిద్ధంగా ఉన్నారని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేసి 48 గంటలు కూడా గడవకముందే తాజాగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News