జేఎన్‌యూ బయట భారీగా పోలీసుల మోహరింపు

ఛలో పార్లమెంట్‌కు జేఎన్‌యు విద్యార్థుల పిలుపు.. మిగితా విశ్వవిద్యాలయాల విద్యార్థులను కూడా తమతో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి

Last Updated : Nov 18, 2019, 01:00 PM IST
జేఎన్‌యూ బయట భారీగా పోలీసుల మోహరింపు

న్యూ ఢిల్లీ: హాస్టల్ ఫీజు పెంపుపై అక్టోబర్ 29 నుంచి నిరసన వ్యక్తంచేస్తూ వస్తోన్న జేఎన్‌యూ (జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ) విద్యార్థి సంఘాలు నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఛలో పార్లమెంట్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలో తమకు మద్దతు తెలుపుతూ మిగితా విశ్వవిద్యాలయాల విద్యార్థులను కూడా తమతో కలిసి రావాల్సిందిగా జేఎన్‌యు విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే, జేఎన్‌యు విద్యార్థులను క్యాంపస్‌ వద్దే అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే యూనివర్శిటీ పరిసరాల్లో సెక్షన్ 144 విధించిన పోలీసులు.. విద్యార్థులు ఎవ్వరూ బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అరుణ అసఫ్ అలీ మార్గం, తూర్పు గేటును మూసేసిన పోలీసులు.. క్యాంపస్ బయట భారీ సంఖ్యలో మోహరించారు.

పారామిలిటరీ బలగాలతో పాటు 9 కంపెనీలు గేటు వద్ద విద్యార్థులు బయటకు రాకుండా పహారా కాస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు కలిపి మొత్తం 1200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.

Trending News