తీవ్రమైన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ కరుణానిధిని పరామర్శించిన అనంతరం ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ తాను కరుణానిధిని కలిసినట్టు తెలిపారు. కరుణానిధి కోలుకుంటున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తమిళనాడు వాసుల వలె గట్టి మనిషి. తమిళనాడు స్పూర్తి ఆయన శరీరంలోనే ఉంది అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తన తల్లి సోనియా గాంధీ సైతం కరుణానిధి కుటుంబానికి మనోధైర్యాన్నిస్తూ సందేశాన్ని పంపించినట్టు రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. కరుణానిధితో కాంగ్రెస్ పార్టీకీ సుదీర్ఘమైన అనుబంధం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.
రాహుల్ గాంధీ కావేరి ఆస్పత్రికి వచ్చినప్పుడు తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సు తిరునవుక్కరసర్‌తోపాటు పార్టీ నేత ముకుల్ వాస్నిక్ ఆయన వెంట ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ భారీ బందోబస్తు మధ్య నేరుగా అల్వార్‌పేట్‌లోని కావేరి ఆస్పత్రికి వెళ్లారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఆస్పత్రి వద్ద రాహుల్ గాంధీకి ఎదురువెళ్లి ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. గతంలో ఊపిరితిత్తులు, గొంతుకు ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇదే ఆస్పత్రిలో చేరిన కరుణానిధిని 2016, డిసెంబర్ 17న రాహుల్ గాంధీ వచ్చి కలవడాన్ని ఈ సందర్భంగా డీఎంకే నేతలు గుర్తు చేసుకున్నారు.