తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న కావేరి ఆస్పత్రి వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామిని కలవడం చర్చనియాంశమైంది. ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసిన వారిలో కరుణానిధి పెద్ద కొడుకు ఎం.కే. అళగిరి, చిన్నకొడుకు ఎం.కే. స్టాలిన్. కూతురు కనిమొళి, కరుణానిధి అల్లుడు మురసోలి సెల్వన్, పార్టీ సినియర్ నేతలు టీ.ఆర్. బాలు, ఐ పెరియస్వామి ఉన్నారు. చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో దాదాపు 15-20 నిమిషాలపాటు ఎం.కే. స్టాలిన్ బృందం ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ అయ్యింది.
ఇదిలావుంటే, ఐసీయూలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత విషమించినట్టు కావేరి వైద్యులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉంది.