అరబ్ దేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పాలస్తీనాలో పర్యటించనున్నారు. జోర్డాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మోదీ ఇవాళ పాలస్తీనా చేరుకోనున్నారు. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కనున్నారు.
మోదీకి ముందు ప్రణబ్ ముఖర్జీ అక్టోబర్ 2015లో, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 2016లో పాలస్తీనాను సందర్శించారు. ఆ తరువాత గతేడాది 2017 మేలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చారు.
రామల్లాలో ఫిబ్రవరి 10న ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌ను కలుస్తారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య నాల్గవ సమావేశం. భేటీలో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించనున్నారు. భేటీకి ముందు, ప్రధాని మోదీ యాసర్ అరాఫత్ మ్యూజియంను సందర్శించి పాలస్తీనా నాయకుడికి నివాళులు అర్పిస్తారు. అయితే, మోదీ పాలస్తీనాలో కొన్ని గంటలు మాత్రమే ఉంటారు. శనివారం రాత్రి అబుదాబి చేరుకుంటారు.