Nagaland: చిందిన రక్తానికి ప్రతీకారం తప్పదు-కాల్పుల ఘటనపై ఎన్‌ఎస్‌సీఎన్ హెచ్చరిక

NSCN threatens retaliation for Nagaland Civilians Killing : ఇటీవలి నాగాలాండ్ కాల్పుల ఘటనకు ప్రతీకారం తప్పదని వేర్పాటు వాద గ్రూప్ 'ఎన్‌ఎస్‌సీఎన్' కేంద్రాన్ని హెచ్చరించింది. చిందిన అమాయక ప్రజల రక్తం ప్రతీకారం తీర్చుకుంటుందని తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 06:32 PM IST
  • నాగాలాండ్ కాల్పుల ఘటనపై ఎన్‌ఎస్‌సీఎన్ హెచ్చరిక
  • ప్రతీకారం తప్పదని లేఖ విడుదల చేసిన ఎన్‌ఎస్‌సీఎన్
  • ఇప్పటివరకూ సంయమనం పాటించామన్న ఎన్‌ఎస్‌సీఎన్
Nagaland: చిందిన రక్తానికి ప్రతీకారం తప్పదు-కాల్పుల ఘటనపై ఎన్‌ఎస్‌సీఎన్ హెచ్చరిక

NSCN threatens retaliation for Nagaland Civilians Killing : నాగాలాండ్‌ కాల్పుల ఘటనతో (Firing in Nagaland) ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక చట్టంపై మరోసారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. గతంలో ఈ చట్టం ఉపసంహరణకు సామాజిక కార్యకర్త ఇరోమ్ షర్మిల సుదీర్ఘ కాలం నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో కేంద్ర హోంశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు నాగాలాండ్ వేర్పాటు వాద గ్రూప్ 'ఎన్‌ఎస్‌సీఎన్' (National Socialist Council of Nagaland) తాజాగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాల్పుల ఘటనకు ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. 'చిందిన అమాయక ప్రజల రక్తం త్వరలో లేదా తర్వాతైనా ప్రతీకారం తీర్చుకుంటుంది.' అని పేర్కొంటూ ఆ గ్రూప్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

శాంతియుత వాతావరణం కోరుకుంటున్న తమ ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకూ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా తమను తాము నిగ్రహించుకున్నామని 'ఎన్‌ఎస్‌సీఎన్' (National Socialist Council of Nagaland) పేర్కొంది. శాంతియుతంగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్న నాగా ప్రజలకు ఈ ఆక్రమణదారుల నుంచి దక్కినదేంటి... చిత్రహింసలతో కూడిన అత్యాచారాలకు గురవడం, హత్యలకు గురవడం, ఎప్పటికప్పుడు చెప్పలేని బాధలు పడటం...' అని ఎన్‌ఎస్‌సీఎన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాబట్టి సమయం వచ్చినప్పుడు ప్రతీకార దాడులు తప్పవని... ఆ సందర్భం వచ్చినప్పుడు నాగా ప్రజలు (Nagaland) తమను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపింది. కాల్పుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఎన్‌ఎస్‌సీఎన్ చేసిన ఈ హెచ్చరికలో నాగాలాండ్‌లో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్మీ జవాన్ల కాల్పుల్లో సాధారణ పౌరుల మృతి :

రెండు రోజుల క్రితం నాగాలాండ్‌లోని (Nagaland) మోన్ జిల్లా ఒటిన్ గ్రామంలో ఆర్మీ జవాన్లు ఓ వ్యానులో వెళ్తున్న సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది అమాయక పౌరులు మృతి చెందారు. సైన్యం వారిని తీవ్రవాదులుగా పొరబడి ఈ కాల్పులకు పాల్పడింది. ఆ ప్రాంతంలో తీవ్రవాదుల కదలికలపై సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనను నిరసిస్తూ స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఆర్మీ వాహనాలకు వారు నిప్పంటించారు.

కాల్పుల ఘటనపై (Nagaland Firing Incident) నాగాలాండ్‌ సీఎం నీఫుయు రియో సిట్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని... ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాయుధ బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: Benifits of having Beard: 'గడ్డం'తో మీకు తెలియని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News