'కరోనా వైరస్'తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా దెబ్బకు అన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఐతే ప్రధాని నరేంద్ర మోదీ సకాలంలో స్పందించి లాక్ డౌన్ విధించారు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేదనే చెప్పవచ్చు. మరోవైపు కరోనాను ఐకమత్యంతో ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజల్లో ఐకమత్య స్ఫూర్తిని రగిలించేందుకు ఆదివారం రాత్రి 9 గంటల 9 నిముషాలకు అందరూ ఇళ్లల్లోని లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.
అంటే దేశంలో ఈ రోజు(ఆదివారం) మరో దీపావళి జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే .. ఏటా దీపావళి పండుగ రోజుల్లో జరిగినట్టే .. మట్టి దీపాలు వెలిగించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్లలో మట్టి దీపాల అమ్మకం పెరిగింది. ఎక్కడ చూసినా మట్టి దీపాలను విక్రయిస్తున్నారు. ఈ రోజు రాత్రి దీపాలు వెలిగించేందుకు చాలా మంది మట్టి దీపాలు కొనుగోలు చేస్తున్నారు. కరోనా చీకట్లను కాల్చిపారేస్తామంటున్నారు. మరోవైపు మట్టిదివ్వెలతోపాటు కొవ్వొత్తుల అమ్మకం కూడా జోరుగా పెరిగింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..