రూ.90 దాటిన పెట్రోల్.. వాహనదారుల గుండెలు గుబేలు

ఇవాళ కొత్త రికార్డును నమోదు చేసిన పెట్రోల్ ధర

Last Updated : Sep 24, 2018, 09:32 AM IST
రూ.90 దాటిన పెట్రోల్.. వాహనదారుల గుండెలు గుబేలు

పెట్రో ధరలు లీటర్‌కు రూ వందవైపు దూసుకెళ్తుండటంతో వాహనదారుల గుండెలు గుబేలు మంటున్నాయి. ఇక తాజాగా ఇవాళ కూడా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. ఇక తాజాగా పెరిగిన ధరలతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ. 90.08కు, డీజిల్ ధర రూ. 78.58కు చేరుకున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 82.72గా ఉండగా, డీజిల్‌ ధర రూ.74.02కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 85.99కి, డీజిల్‌ ధర రూ. 78.26కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ.84.54, డీజిల్‌ ధర రూ.75.87కి పెరిగింది.

ఇదే సమయంలో హైదరాబాద్‌‌లో పెట్రోలు ధర రూ. 87.70కి చేరగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.87.07, డీజల్ రూ.79.50లుగా ఉంది. బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు 83.37గా, డీజిల్ ధర రూ. 74.40గా ఉంది. భారీ పెట్రోల్‌ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారు.

కాగా ఇంధన ధరలు పెరగడంతో దీని ప్రభావం రవాణా రంగంతో పాటు అన్ని రంగాలపై పడుతుందని.. దేశంలో నిత్యావసర సరుకుల నుంచి అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రో భారాలతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు.

కాగా రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వాహనదారులకు ఊరట కలిగించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే..!  ఏపీ సర్కార్ రూ.2, రాజస్తాన్ రూ.2.5, పశ్చిమ బెంగాల్ రూ.1, కర్ణాటక రూ.2 ఇంధన ధరలను తగ్గించాయి.

 

Trending News