భారతీయ జనతా పార్టీ మరోమారు పంజాబ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై మండిపడింది. దక్షిణ భారతదేశంలో తాను ఉండలేనని.. అక్కడి వారి భోజనం తినలేనని ఈ మధ్యకాలంలో సిద్ధూ తెలిపారు. అయితే పాకిస్తాన్ వెళితే మాత్రం అక్కడివారితో బాగానే కలిసిపోతానని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేత సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు.
సిద్ధూ ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ పై ఎంతో గాఢమైన ప్రేమ చూపిస్తున్నారని.. అలాంటి ఆయన వెళ్లి పాకిస్తాన్ క్యాబినెట్లో చేరాలని.. భారత్ విడిచివెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. సిద్ధూ ఆ కార్యక్రమానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఆలింగనం చేసుకున్న సంఘటన కూడా పెద్ద దుమారమే రేపింది. సిద్ధూ దేశభక్తుడు కాదని కూడా బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శించారు. తర్వాత... అదే విషయంపై పంజాబ్ సీఎం కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తాజాగా దక్షిణభారతదేశంలో ఉండలేనంటూ చెప్పిన సిద్ధూ.. పాకిస్తానీయులతో మాత్రం బాగానే కలిసి పోతానని చెప్పడం పెద్ద సమస్యనే తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పటికే ట్రోలింగ్ చేస్తున్నారు. బీజేపీ చెప్పినట్లుగానే సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి అక్కడి క్యాబినెట్ వర్గంలో చేరాలని అంటున్నారు. తాజాగా బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు కూడా ఈ విషయంపై తన స్పందనను తెలిపారు. రాహుల్ గాంధీ వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని.. అలాగే సిద్ధూ చేత కూడా చెప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పై ప్రేమ కురిపించడం ఇది తొలిసారి కాదని ఆయన అన్నారు.