అన్నింటికంటే దేశమే ముఖ్యం: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టి నేటికి నాలుగేళ్లు (మే 26, 2014న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం) పూర్తయింది.

Last Updated : May 26, 2018, 12:11 PM IST
అన్నింటికంటే దేశమే ముఖ్యం: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టి నేటికి నాలుగేళ్లు (మే 26, 2014న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం) పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం కనబరుస్తున్న ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

'మీరు ఇస్తున్న మద్దతు,చూపిస్తున్న ప్రేమానురాగాలే మాకు కొండంత బలం. ఇదే అంకితభావంతో మున్ముందు ప్రజలకు సేవ చేస్తాం.ఈ నాలుగేళ్ళలో అభివృద్ధి ఓ ఉద్యమంలో మారింది' అని మోదీ ట్వీట్ చేశారు.

 

దేశమే తనకు అన్నింటికంటే అతి ముఖ్యమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014లో ఇదే రోజున తాము అధికారంలోకి వచ్చామని, భారత్‌ను రూపాంతరం చెందించడమే లక్ష్యంగా కృషి చేశామని మోదీ ట్వీట్‌ చేశారు. గత నాలుగేళ్లలో అభివృద్ధే లక్ష్యంగా దేశం ముందడుగు వేసిందన్నారు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని అత్యున్నత శిఖరాలపైకి చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మోదీ ట్వీట్‌ చేశారు.

 

బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్‌ 48 ఏళ్ల పాలనతో పోల్చితే మోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలంటూ బీజేపీ కార్యాచరణను చేపట్టనుంది.

 

అవినీతిని అరికట్టాలనే విషయంలో మోదీ చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరు. నోట్ల రద్దు వంటి విషయాల్లో తొందరపాటు తనాన్ని ప్రదర్శించినా దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మెజార్టీ ప్రజలు అర్థం చేసుకొన్నారు. ఈ కారణంగానే దేశంలో పెద్దగా నిరసనలు జరగలేదు.

ప్రజాకర్షక విధానాల్లో సైతం కొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. సబ్సిడీలకు కోత పెట్టి.. ఇంతవరకూ గ్యాస్ వినియోగానికి నోచుకోని వారికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా సిలిండర్లు అందచేశారు. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ పథకమే. జీఎస్టీ అమలు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఆర్థిక విషయాల్లో దీర్ఘకాల దృష్టి మోదీ పాలనలో కీలక పరిణామం.

 

ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగింది. మోదీ స్వల్ప వ్యవధిలో ఏ ప్రధాని చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు. దేశంలో రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో విదేశాలకు సానుకూల సంకేతం పంపినట్లయింది. భారత్‌తో స్నేహసంబంధాలను పెంచుకోవడానికి, వ్యాపారాలు చేయాడానికి, పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు పోటీపడే స్థితి ఏర్పడింది. ఇది మోదీ సాధించిన విజయమే.  

ప్రశంసలు.. విమర్శలు

కుల, కుటుంబ పాలన, ప్రాంతీయ విద్వేషాలతో జాతి సమగ్రతను పణంగా పెడుతున్న పార్టీలకు మోదీ పాలన ఒక హెచ్చరిక. చిల్లర డిమాండ్లతో జాతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వాములవుతున్న పార్టీలను నియంత్రించగలిగారు. చిన్న పార్టీలు చెప్పినట్లు నడుచుకోవాల్సిన దుస్థితి నుంచి కేంద్రాన్ని బయటపడేశారు.

అయితే ఈ నాలుగు సంవత్సరాలలో మోదీపై ప్రశంసలతో పాటు.. విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఇచ్చిన ‘అచ్చేదిన్‌’,‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ వంటి ఆకర్షణీయమైన నినాదాల అమలు ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయం, నిత్యావసరాల ధరలు, పెట్రోఉత్పత్తుల ధరలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమి, శాంతి, భద్రతల సమస్య వంటివి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వీటన్నింటికీ సవాల్‌గా మోదీ, ఆయన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే!

Trending News