పాట్నా: ప్రియాంకా గాంధీ వాద్రాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడంపై బీజేపీ నేత, బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీ చాలా అందంగా ఉంటుంది కానీ ఆమె అందాన్ని ఓటర్లు ఓట్లు వేయరు అని వినోద్ నారాయన్ ఝా అన్నారు. ప్రియాంకా గాంధీని తూర్పు యూపీకి ఇంచార్జ్‌గా నియమించారు కానీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అసలు యూపీలో ఆమె ప్రభావమే ఉండదని నారాయణ్ ఝా తేల్చిచెప్పారు. అంతేకాకుండా భూ కుంభకోణంతోపాటు పలు ఇతర అవినీతి కేసుల్లో చిక్కుకున్న రాబర్ట్ వాద్రా భార్య కనుక ఆమెను మొహాన్ని చూసి జనం ఓట్లు వేయరు అని నారాయణ్ ఝా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఇదిలావుంటే, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ సైతం ప్రియాంకా గాంధీ రాజకీయ ప్రవేశాన్ని ఎద్దేవా చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉన్న మహిళను రాజకీయాల్లోకి తీసురావడంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంతోషం వ్యక్తంచేస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీని సుశీల్ మోదీ ఎద్దేవా చేశారు. కేవలం చూడ్డానికి ఇందిరా గాంధీలా ఉండొచ్చు కానీ ఆ ఇద్దరికి మధ్య ఎంతో తేడా ఉందని చెబుతూ.. రాజకీయాల్లో డూప్లికేట్స్‌తో ప్రయోజనం ఉండదని అన్నారు.